Kurnool Diamonds: వజ్రాలు కాదు.. రంగు రాళ్లు

Kurnool Diamonds సాధారణంగా వర్షాలు పడినప్పుడు.. భూమి మీద ఉండే కొన్ని రాళ్లు మట్టిని వదిలించుకుంటాయి. అందంగా కనిపిస్తాయి. అందులో అరుదైన రంగు రాళ్లు బయటపడతాయి.

Written By: Dharma, Updated On : May 29, 2024 10:35 am

Kurnool Diamonds

Follow us on

Kurnool Diamonds: ఒక్కోసారి మీడియా చేసే ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ఇటువంటి ప్రచారంతోనే ఇప్పుడు ప్రజలు వజ్రాల బాటపట్టారు. నదులు, పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతున్నారు. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వజ్రాల వేట కొనసాగుతోంది. ప్రజలు తమ పనులను మానుకొని మరి ఈ వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించడం ఆందోళన కలిగిస్తోంది.అయితే అవి వజ్రాలు కాదు.. రంగు రాళ్లు అని తెలుస్తోంది.

సాధారణంగా వర్షాలు పడినప్పుడు.. భూమి మీద ఉండే కొన్ని రాళ్లు మట్టిని వదిలించుకుంటాయి. అందంగా కనిపిస్తాయి. అందులో అరుదైన రంగు రాళ్లు బయటపడతాయి. అవి బంగారు ఆభరణాల తయారీలో కీలకంగా ఉంటాయి. అందుకే వాటికి విపరీతమైన ధర. కర్నూలు జిల్లాలో ఒకరిద్దరకు దొరికినవి రంగురాళ్లే. కానీ అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని.. వాటి విలువ లక్షల్లో ఉంటుందని మీడియా ప్రచారం చేస్తుంది. అది నమ్మిన రైతులు తమ పనులు మానుకొని.. పొలాల్లో సైతం వెతుకులాట ప్రారంభించారు. అదేపనిగా జల్లెడ పడుతున్నారు. సామాన్యులు సైతం నదులు, పొలాల్లో వజ్రాల వేట కొనసాగిస్తుండడం విశేషం.

వందలాదిమంది ఈ వజ్రాల కోసం వెతుకులాట సాగిస్తున్నారు. కానీ ఒక నలుగురు, ఐదుగురుకు మాత్రమే ఇవి దొరుకుతుంటాయి. అవి కూడా వేలల్లోనే ఉంటాయి. కొంతమంది వ్యాపారులు అక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు. వారికి సైతం అవి రంగురాళ్లే అని తెలుసు. కానీ వజ్రాలు అని ప్రచారం చేస్తే.. వెతుకులాట ఎక్కువగా జరుగుతుందని.. వ్యాపారం చేసుకోవచ్చని వారు నోరు మెదపరు. వజ్రాలు గానే పరిగణిస్తుంటారు. అయితే రంగురాళ్ల వెతుకులాట పుణ్యమా అని.. వ్యవసాయ పనులకు కూలీలు దొరకని పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. అటు చాలామంది ఉపాధి పనులకు సైతం దూరమై.. అదే పనిగా వజ్రాల వేట సాగిస్తున్నారు.