Sankranti 2026 : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి( Pongal) సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాలు కళకళలాడుతున్నాయి. సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు స్వగ్రామాలకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. భోగి పర్వదినంతో మూడు రోజుల పండగ ప్రారంభం అవుతుంది. నిన్ననే రాష్ట్రవ్యాప్తంగా భోగిని ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధానంగా కోస్తాంధ్రలో ఒక ప్రాచీన సంప్రదాయంగా కొనసాగుతోంది కోడిపందాలు. ప్రభుత్వాలతో పాటు చట్టపరంగా ఆంక్షలు ఉన్నప్పటికీ కోడిపందాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇదో సాంప్రదాయమైన క్రీడగా పరిగణిస్తారు స్థానికులు. కోడిపందాలు అనేవి సంక్రాంతిలో భాగమైపోయాయి. అందుకే అడ్డుకట్ట పడటం లేదు. గోదావరి జిల్లాల వ్యాప్తంగా కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే బరుల్లో కోళ్లు తలపడ్డాయి. మరో రెండు రోజులపాటు ఇవి కొనసాగుతాయి.
* మహిళలు సైతం బెట్టింగులు..
అయితే గతానికి భిన్నంగా ఈసారి మహిళలు కూడా బెట్టింగులకు( bettings ) దిగుతుండడం విశేషం. కోడిపందాలను తిలకించడంతోపాటు బెట్టింగ్ కట్టేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అందులో మహిళలు కూడా ఉంటున్నారు.. లక్ష నుంచి 50 లక్షల రూపాయల వరకు బెట్టింగ్ సాగుతోంది. మరోవైపు పోటీలను తిలకించేవారు సైతం పదివేల నుంచి 50 వేల వరకు బెట్టింగ్ కడుతున్నారు కోళ్లపై. ఈసారి కోడిపందాల బరులకు టెక్నాలజీ తోడైంది. భారీ ఎల్ఈడి స్క్రీన్లతో పాటు డిజిటల్ సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఇంకో వైపు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉండేలా సమీపంలోనే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. వెయ్యి నుంచి 5000 మంది వరకు చూసేలా కుర్చీలు సైతం ఏర్పాటు చేశారు. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బెట్టింగ్ కట్టేందుకు తరలి రావడం విశేషం. ఉభయగోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో కూడా ఈ కోడిపందాలు కొనసాగుతున్నాయి.
* విలువైన వాహనాలను బహుమతులుగా..
కోడిపందాలు అంటే జూదం కింద వస్తోంది. అయితే ఆ ప్రాంతీయులు మాత్రం ఇది జూదంగా చూడకూడదని.. సెంటిమెంట్‌తో కూడుకున్న ప్రాచీన క్రీడగా చూడాలని కోరుతున్నారు. ప్రభుత్వాలతో పాటు పోలీస్ ఆంక్షలు నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో… నగదు బదులు పారితోషికాలు ప్రకటిస్తున్నారు. ఆపై విలువైన బహుమతులను సైతం ఇస్తామని చెబుతున్నారు. కోడిపందాలకు సంబంధించి చివరి రోజు విజేతలకు ‘థార్’ వంటి వాహనాలతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను బహుమతులుగా ప్రకటించారు నిర్వాహకులు. దీంతో పందాలు కట్టేందుకు ముందుకు వస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. కోడిపందాల ద్వారా భారీ మొత్తంలో చేతులు మారుతున్నాయి. ప్రభుత్వము, పోలీసుల ఆంక్షలు.. స్థానికుల సెంటిమెంట్ ముందు పనిచేయడం లేదు. అయితే ఈ ప్రాచీన క్రీడ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమవుతుండడం విశేషం. బరుల ఏర్పాటు వెనుక రాజకీయ నేతల హస్తం అధికం.