Sakshi Self Goal : ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైసీపీలో పనిచేసిన కీలక నాయకులను అరెస్ట్ చేసింది. ఇందులో పోసాని కృష్ణ మురళి, వల్లభనేని వంశీ, బోర్లగడ్డ అనిల్, ఇంకా కొంతమంది కీలక నాయకులు ఉన్నారు.. ఒకరకంగా వీరి అరెస్టులు కూటమి ప్రభుత్వానికి కాస్త సాంత్వన కలిగించాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరి అరెస్టులతోనే మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది. ఫలితంగా ఆరు గ్యారెంటీ ల అమలు పక్కదారి పట్టింది. కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన కొంతమంది వైసీపీ నాయకులకు బెయిల్ లభించడంతో.. కాస్త ఆ వివాదాలు పక్కకు వెళ్లిపోయాయి. మళ్లీ ఆరు గ్యారెంటీల అంశం తెరపైకి వచ్చింది. ఇదే క్రమంలో వైసిపి వెన్నుపోటు దినం నిర్వహించింది. ఏపీలో ప్రస్తుతం రాజకీయంగా జీవన్మరణ సమస్య ఎదుర్కొంటున్న వైసీపీకి వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించిన నిరసన కాస్త జీవధానాన్ని ఇచ్చినట్టే అనుకోవాలి. అయితే వచ్చిన ఈ మైలేజ్ ను పూర్తిస్థాయిలో వాడుకొని.. ప్రజల్లో బలం పెంచుకోవాల్సిన చోట ఒకసారిగా వైసిపి సెల్ఫ్ గోల్ చేసుకుంది. సమయం కోసం ఎదురుచూస్తున్న కూటమి ప్రభుత్వం అనుకూల మీడియా ఒక్కసారిగా రెచ్చిపోయింది. అన్ని చానల్స్ వైసిపిని ఎండగట్టే ప్రయత్నం మొదలుపెట్టాయి.
ఇంతకీ ఏం జరిగింది అంటే..
వైసిపి మౌత్ పీస్ సాక్షి.. నిన్న ఒక డిబేట్ నిర్వహించింది. ఆ డిబేట్ లో అమరావతి రాజధాని నిర్మాణం గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. సాధారణంగా సాక్షి టీవీలో ఉదయం పూట కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ నిర్వహిస్తుంటారు. ఈ డిబేట్లో కృష్ణంరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ పాల్గొన్నారు. ఆయన అమరావతి నిర్మాణంలో సాధక బాధకాలను.. అవరోధాలను కనుక ప్రముఖంగా చెప్పి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. పైగా ఆ డిబేట్ కు సార్థకత కలిగి ఉండేది. కాకపోతే ఆయన అమరావతి నిర్మాణానికి సంబంధించి వ్యక్తిగత కక్షను మనసులో పెట్టుకొని విమర్శలు చేశారు. ఆడవాళ్లను లక్ష్యంగా చేసుకొని అనకూడని మాటలు అన్నారు. ఆ మాటలను కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించకపోగా.. మళ్లీ మళ్లీ ప్రస్తావించారు. దీంతో ఆ డిబేట్ కాస్త వివాదంగా మారిపోయింది. సమయం కోసం ఎదురుచూస్తున్న కూటమి అనుకూల మీడియా రెచ్చిపోయింది. ఇక ఈరోజు నుంచి పుంఖానుపుంఖాలుగా వార్తలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. పనిలో పనిగా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన మహిళ రైతులు తెరపైకి వచ్చారు. డిబేట్ నిర్వహించిన కొమ్మినేని, అందులో రాయడానికి వీలు లేని స్థాయిలో విమర్శలు చేసిన కృష్ణంరాజుపై మండిపడ్డారు. అంతేకాదు ఇంటికి వస్తే చెప్పులతో కొట్టాలని కొమ్మినేని, కృష్ణంరాజు సతీమణులకు సూచించారు.
ఇక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి,టీవీ 5 లో కొమ్మినేని, కృష్ణంరాజు నిర్వహించిన డిబేట్ పై చర్చ మొదలైంది. వీటిపై అటు వెంకటకృష్ణ, ఇటు సాంబశివరావు డిబేట్లు నిర్వహిస్తున్నారు. పనిలో పనిగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ” అమరావతిని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు.. అసలు ఎందుకు ఇలాంటి బ్యాచ్ తో విమర్శలు చేయిస్తున్నారు.. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలలో పాటు అమరావతి ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే ఊపిరి ఊదుకుంటున్నది. ఇలాంటి సమయంలో గంజాయి బ్యాచ్, నేరస్తులతో విమర్శలు చేయిస్తారా.. ఇది మీకు పద్ధతి గానే ఉందా.. ఇలాంటి వ్యవహారాలు ఎంతవరకు కరెక్ట్.. అమరావతిలో ఉన్న మహిళలపై అడ్డగోలుగా విమర్శలు చేస్తారా.. చెప్పడానికి వీలు లేని.. రాయడానికి వీలు లేని భాషలో బూతులు తిట్టిస్తారా అంటూ” మండిపడటం మొదలుపెట్టారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సినవే అయినప్పటికీ.. వెంకటకృష్ణ, సాంబశివరావు టిడిపి కార్యకర్తలను మించిపోయి విమర్శలు చేయడమే ఈ మొత్తం వ్యవహారంలో అసలైన ట్విస్ట్.