Sakshi Media Krishnamraju News: ఎలక్ట్రానిక్ మీడియాలలో విశ్లేషకులుగా కనిపించే వ్యక్తుల అసలు రంగులు ఇప్పుడు బయట పడుతున్నాయి.. ఇటీవల సాక్షిలో ప్రసారమైన ఓ డిబేట్లో కృష్ణంరాజు అనే ఓ జర్నలిస్టు సంచలన వ్యాఖ్యాలు చేశారు. అమరావతి మహిళలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
కృష్ణంరాజు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఏపీ రాజకీయాలలో కొద్దిరోజులపాటు ప్రకంపనలకు కారణమయ్యాయి. ఆ తర్వాత ఈ ఘటనలో అరెస్టులు కూడా చోటుచేసుకున్నాయి. కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేసి.. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల చేశారు. ఇక కృష్ణంరాజు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కస్టడీ ముగిసినట్టు ఏపీ పోలీసులు ప్రకటించారు. ఇక ఇదే విషయాన్ని సాక్షి మినహా మిగతా మీడియా సంస్థలు ప్రచురించాయి. ఇక ఈనాడులో ఈ వ్యవహారానికి సంబంధించి ఒక కథనం ప్రసారమైంది. దాని ప్రకారం కృష్ణంరాజు పోలీస్ కస్టడీలో కీలక విషయాలు వెల్లడించారని.. సాక్షి మీడియా గ్రూప్ తనను పావుగా వాడుకుందని..జైలు నుంచి విడుదలైన తర్వాత అమరావతి రాజధాని మహిళలను క్షమించమని ఓ వీడియోలో వేడుకుంటారని కృష్ణంరాజు ప్రకటించినట్టు ఈనాడులో ఒక కథనం ప్రసారమైంది..
చంద్రబాబు కక్ష కట్టారట
“గతంలో కృష్ణంరాజు ఓ ఆంగ్ల పత్రికలో కీలక స్థానంలో పని చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పదవి పోవడానికి చంద్రబాబు కారణమని కక్ష పెంచుకున్నారు. ఇక అప్పటినుంచి స్వీయ వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అందులో చంద్రబాబును తీవ్రస్థాయిలో విమర్శించారు. దీంతో ఆయనను సాక్షి యాజమాన్యం సంప్రదించింది. ఇక అప్పటినుంచి ఆయనను విశ్లేషకుడిగా రావాలని కోరింది. దీంతో కృష్ణంరాజు సాక్షిలో విశ్లేషకుడిగా.. వైసిపికి అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు.. అయితే ఇటీవల అమరావతి రాజధాని మహిళలపై కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అది వివాదంగా మారింది. ఈ వ్యవహారంలో పోలీసులు కూడా ప్రవేశించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చివరికి కృష్ణంరాజు అరెస్ట్ కావలసి వచ్చిందని” ఈనాడు తన రాసిన కథనంలో పేర్కొంది.. ఇక కృష్ణంరాజు పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. సాక్షి మీడియా తనను పావుగా వాడుకున్నదని.. తను ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వైసీపీ నేతలు పరామర్శించడం లేదని.. శ్రీనివాసరావు విషయంలో చూపించినట్టుగా.. తన విషయంలో చొరవ చూపించడం లేదని కృష్ణంరాజు వాపోయినట్టు తెలుస్తోంది. అయితే కృష్ణంరాజు కస్టడీకి సంబంధించి ఒక వార్త కూడా సాక్షి మీడియాలో కనిపించకపోవడం విశేషం.
ఇటీవల గుంటూరు జిల్లాలో వైసీపీ అధినేత పర్యటించినప్పుడు చోటు చేసుకున్న వివాదం.. నిన్నంతా ఓవర్గం మీడియాలో వ్యతిరేకంగా ప్రసారమైంది. ఇక సాక్షిలో సానుకూలంగా ప్రసారమైంది. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు అనే విషయాన్ని చెప్పడంలో సాక్షి విఫలమైనప్పటికీ.. అదే స్థాయిలో ప్రచారాన్ని మాత్రం ఆ మీడియా గ్రూప్ వదులుకోలేదు.. ఇక దొరికిందే అవకాశంగా కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా వైసీపీ అధినేత మీద విపరీతమైన వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టింది.