Sakshi building fire sensational truth : అమరావతి( Amaravathi ) మహిళా రైతులపై అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహిళలు దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట సాక్షి ఛానల్ లో అమరావతి వేశ్యల రాజధాని అంటూ కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ సంచలన కామెంట్స్ చేశారు. దానిని సమర్థిస్తూ మాట్లాడారు యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. ఈ తరుణంలో అమరావతిలో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. ఈ క్రమంలో మహిళా రైతుల ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టులో హాజరు పరచగా ఆయనకు కోర్టు రెండు వారాలపాటు రిమాండ్ విధించింది. అయితే దీనిపై సాక్షి యాజమాన్యం ఇటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆందోళన కారులు సాక్షి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడే ఆందోళనలు జరుపుతున్నారు.
* ఫర్నిచర్ గోదాంలో ప్రమాదం..
ఏలూరు సాక్షి కార్యాలయం పై( Eluru Sakshi office) దాడి చేసి నిప్పు పెట్టారు అన్న వార్త నిన్న రోజంతా హల్చల్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సాక్షి మీడియా కార్యాలయాల ఎదుట ఆందోళనలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు సాక్షి పత్రికకు సంబంధించి కార్యాలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో కార్యాలయం కాలిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే అగ్ని ప్రమాదం జరిగింది సాక్షి కార్యాలయంలో కాదు. కిందనే ఉన్న ఫర్నిచర్ గోదాంలో. ఏలూరులో ఒకే భవనంలో పైన సాక్షి కార్యాలయం, కింద పాత ఫర్నిచర్ గోడౌన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్ననే సాక్షి కార్యాలయం వద్ద ఆందోళనలు జరిపారు. కానీ కిందనే ఉన్న గోదాములు అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే అది ఆందోళనకారులు నిప్పు పెట్టడం వల్లేనని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పోలీసులు విచారణలో మాత్రం అటువంటిదేమీ లేకుండా పోయింది. గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించిందని తేల్చారు పోలీసులు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
* వైసీపీ సోషల్ మీడియాలో వైరల్..
అయితే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సోషల్ మీడియాలో మాత్రం ఆందోళనకారులు దహనం చేశారని ప్రచారం జరిగింది. పోలీసులు మాత్రం ఇది ప్రమాదంగా తేల్చారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు కొనసాగాయి. ఎక్కడికక్కడే ఆందోళనకారులు కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు నిలువరించడంతో పరిస్థితి సద్దుమణిగింది.ఇంత జరుగుతున్నా జర్నలిస్ట్ సంఘాలు ఈ ఘటనపై స్పందించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాజకీయ కారణాలతోనే ఈ పరిణామాలన్నీ జరిగాయి. పైగా జర్నలిస్టులు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారు. అందుకే ఈ ఘటన విషయంలో స్పందించేందుకు జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు ముందుకు రావడం లేదు. మరోవైపు నిందితుడిగా ఉన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు కోసం పోలీసులు వెతుకుతున్నారు. అటు సాక్షి యాజమాన్యంపై కూడా కేసు నమోదయింది. కృష్ణంరాజు తో పాటు సాక్షి యాజమాన్య ప్రతినిధులను అరెస్టు చేస్తారా? ఆ ఇద్దరి అరెస్టుతో కథ ముగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.