Sajjala Ramakrishna Reddy : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం కూడా నడుస్తోంది. దాదాపు పేరు మోసిన నేతలపై కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ హయాంలో చేసిన తప్పిదాలకు.. ఇప్పుడు కొత్తగా చేస్తున్న తప్పులకు సైతం బాధ్యులను చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి పై మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదు. వారి జోలికి కూడా పోవడం లేదు. అయితే వారిని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేయలేదు. ఆ బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించి.. తాను మాత్రం బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు.
* ఆ బాధ్యత మరువని చంద్రబాబు..
2019లో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ సమయంలో చంద్రబాబు అత్యంత ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అయినా సరే పార్టీని సమర్థవంతంగా నడిపించగలిగారు. తన పాత్ర తాను పోషిస్తూనే మిగతా నాయకులను యాక్టివ్ చేశారు. నారా లోకేష్ సైతం అలానే వ్యవహరించారు. ఇబ్బందులు వస్తాయని తెలిసి మరి ఎదుర్కొన్నారు. ఎన్నెన్నో అవమానాలను ఎదుర్కొని నిలబడ్డారు. కానీ జగన్ మోహన్ రెడ్డి లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. తాను బయట ఉండి.. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారితో పార్టీని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. కానీ అది ఎంత మాత్రం సహేతుకం కాదు. ఇటీవల మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి దీనిపైనే వ్యాఖ్యానించారు. జగన్ చుట్టూ భజన పరులు ఉన్నారని.. వారిని దూరం పెట్టి పార్టీ కోసం పని చేస్తే తప్ప భవిష్యత్తు లేదని తేల్చేశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఎటువంటి మార్పు రావడం లేదు.
* పార్టీ శ్రేణులతో సజ్జల..
ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ . రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ( sajjala Ramakrishna Reddy )పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కిందిస్థాయి నేతలతో సైతం మాట్లాడారు. అయితే ఆ పని చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి అని ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు. 2019లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పార్టీ జిల్లా నుంచి సీనియర్లతో పాటు జూనియర్లతో మాట్లాడి పార్టీస్థితిగతులను అడిగి తెలుసుకునేవారు. ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని వాటిని అధిగమించే ప్రయత్నం చేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇటువంటి వాటికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పై ఆధారపడుతున్నారు. ఆయన చెప్పిందే ఫాలో అవుతున్నారు.
* కోటరీ అంటే ఆయనేనా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు.. పార్టీకి గుడ్ బై చెబుతున్న వారు ఒకటే మాట చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందంటున్నారు. పార్టీలో నెంబర్ టు గా ఎదిగిన విజయసాయిరెడ్డి బయటకు వెళ్లే క్రమంలో అదే ఆరోపణ చేశారు. పార్టీలో ఉంటూ అధినేతకు ఆత్మీయుడుగా ఉన్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు కూడా అదే మాట. అయితే పరిస్థితులు చూస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి పై ఎటువంటి హెచ్చరికలు లేవు ప్రభుత్వం నుంచి. ఇప్పుడు అరెస్టులు జరుగుతున్న నేతలకు మించి సజ్జలతో పాటు ఆయన కుమారుడు వ్యవహరించారు. కానీ వారిపై ఎటువంటి చర్యలు లేవు. అంటే వారి వెనుక అదృశ్య శక్తి పని చేస్తుందా? కేసులతో పాటు అరెస్టులు లేకుండా చూస్తోందా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే మూడు ఎన్నికలను ఎదుర్కొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండింట దారుణ పరాజయం చవిచూసింది. కనీసం దాని నుంచి చూసైనా నేర్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి పై ఉంది . లేకుంటే ఆయనకు ఎప్పటికీ ఇబ్బందికరమే.