Telugu states MLAs assets: ఒకప్పుడు ప్రజాసేవ చేసే వారంతా ఉదారంగా ఉండేవారు. నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు.. వివాదాల జోలికి వెళ్లేవారు కాదు. సంపాదించుకోవాలి.. తరాలకు సరిపడా దాచుకోవాలి.. అడ్డగోలుగా దోచుకోవాలి అని అనుకునేవారు కాదు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏదైనా సరే.. ఏమైనా సరే.. దాచుకోవడం పెరిగిపోయింది. దోచుకోవడం ఒక స్థాయి దాటిపోయింది. పైగా వారసత్వ ఆస్తి లాగా రాజకీయాల్లోకి తమ కుటుంబ సభ్యులను తీసుకురావడం అధికమైపోయింది. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో అది అత్యంత తీవ్రంగా ఉంది.
పలు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఆస్తులపై association for democratic reforms(ADR) ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేల ఆస్తులు 11,323 కోట్లు అని తేలింది. ఇక ఇదే లెక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఆస్తులు 4,637 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది.. ఇక దేశంలో అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు 14,179 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దేశంలో మొత్తం 119 మంది బిలియనీర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో కర్ణాటక రాష్ట్రం నుంచి 31 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 27 మంది ఉన్నారు.
మెజారిటీ ఎమ్మెల్యేలకు ఎక్కువగా మైనింగ్.. ఇతర వ్యాపారాలు ఉన్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలు కాంట్రాక్టు సంస్థలను నిర్వహిస్తున్నారు.. వీరంతా కూడా తమ సంస్థలలో కుటుంబ సభ్యులను భాగస్వాములు చేశారు. రాజకీయ నాయకుల కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వ నిర్మాణాలలో పాలు పంచుకుంటున్నారు. ఆర్థికంగా స్థిరత్వం ఎక్కువగా ఉన్నవారు రాజకీయాల్లోకి వస్తున్నారు.. రాజకీయాలలోకి రావడం ద్వారా తమ సంపాదనను మరింత పెంచుకుంటున్నారు. అందువల్లే ఈ స్థాయిలో వారికి ఆస్తులు పెరుగుతున్నాయని association for democratic reforms తన నివేదికలో పేర్కొంది.
ఆస్తులు ఈ స్థాయిలో పెరుగుతున్నప్పటికీ నేతల మీద నమోదవుతున్న కేసుల సంఖ్య అంతంత మాత్రం గానే ఉంది. పైగా ఆ కేసులు అంతగా విచారణకు నోచుకోవడం లేదు. ఒకవేళ విచారణకు నోచుకున్నప్పటికీ ఎమ్మెల్యేల ఆస్తుల అసలు బండారం బయటపడడం లేదు. మొత్తంగా చూస్తే అటు అధికార.. ఇటు ప్రతిపక్షం అని తేడా లేకుండా ఎమ్మెల్యేలు దండిగా సంపాదించుకుంటున్నారు. అడ్డగోలుగా వెనకేసుకుంటున్నారు. చూస్తుండగానే వేలకోట్లు సంపాదిస్తున్నారు.