Vijayamma : పాపం విజయమ్మ.. చివరకు సజ్జలకు మొర పెట్టుకోవడం ఏంటి?

అధినేతకు నాయకులకు మధ్య ఒక లైన్ ఉంది. అదే సజ్జల రామక్రిష్ణారెడ్డి. ఇప్పుడు వైఎస్ కుటుంబం మధ్య దొంతరలను ఏర్పాటుచేసింది ఆయనే. అందుకే విజయమ్మ అంతటి మహిళ సజ్జల ఇంటికి వచ్చి మొర పెట్టుకోవాల్సి వచ్చింది.

Written By: Dharma, Updated On : June 8, 2023 4:51 pm
Follow us on

Vijayamma : కాంగ్రెస్ పార్టీతో విభేదించిన జగన్ కు వైఎస్ కుటుంబమంతా అండగా నిలిచింది. భర్త చాటు భార్యగా ఉండే విజయమ్మ నడిరోడ్డుపైకి వచ్చారు. తండ్రి లేని తన కుమారుడికి అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందు కోసం రాజకీయ వేదికలను పంచుకున్నారు. అన్న వదిలిన బాణంగా షర్మిళ ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగారు. సోదరుడు జైల్లో ఉండగా పార్టీని కంటికిరెప్పలా కాపాడుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చాక కుటుంబసభ్యులు జగన్ కు బరువయ్యారు. బద్ధ విరోధులుగా మారిపోయారు. చివరికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టుకున్న సోదరికి వేధింపులు ఎదురైనా పలకరించలేని స్థితికి జగన్ చేరుకున్నారు. అయితే ఇంతటి గ్యాపునకు సజ్జల రామక్రిష్ణారెడ్డి లాంటి వారే కారణమన్న కామెంట్స్ వైసీపీ నుంచే వినిపిస్తుంటాయి.

ప్రస్తుతం వైసీపీలోనూ, ప్రభుత్వంలోనూ సజ్జల రామక్రిష్ణారెడ్డిది అత్యంత నిడివైన పాత్ర.  ప్రభుత్వ ముఖ్య సలహాదారు. కానీ ఆయన జగన్ రెడ్డి ని గుప్పిట్లో పెట్టుకున్నారని ఆయన ఏం చెబితే అది చేస్తారని.. డీఫ్యాక్టో సీఎం అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సీఎం జగన్ కుటుంబసభ్యులు.. ముఖ్యంగా జగన్ తల్లి విజయమ్మ కూడా సజ్జలను ఆశ్రయించక తప్పని అనివార్య పరిస్థితి ఎదురవుతోంది. రహస్యంగా కలిసి సజ్జలకు ఏవో కుటుంబ విషయాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆ మహానేత భార్యకు ఎదురైంది. కుమారుడికి నేరుగా చెప్పుకోలేని ఆమె స్థితి సగటు వైఎస్సార్ అభిమానులను కలచివేస్తోంది.

ఇటీవల విజయమ్మ అమరావతి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఆమె కుమారుడి ఇంటికి వెళ్లాలేదట.
సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి అధికార విధుల్లో సీఎం క్యాంప్ ఆఫీసులో బిజీగా ఉన్న సమయంలోనే… విజయమ్మ సజ్జల ఇంటికి వెళ్లారు. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నారు. ఆమెతో కొంతసేపు మాట్లాడి వెళ్లిపోయారు. అసలు విజయమ్మకు ఇలా సజ్జల ఇంటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. పిలిస్తే చేతులు కట్టుకుని వాళ్ల ముందు నిలబడిన ఫ్యామిలీ సజ్జలది. అలాంటి పరిస్థితి నుంచి ఇంటికి వెళ్లి మరీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి.

కుటుంబం అన్నాక అరమరికలు ఉంటాయి. అయితే అటు కుమార్తె విషయంలో జరిగిన విషయాలు ఆమె మింగుడుపడలేదు. అందుకే తనకు తానుగా కుమారుడి నుంచి దూరమైంది. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి వైదొలిగారు. కానీ కుమారుడితో నేరుగా మాట్లాడే అవకాశమున్నా ఎందుకు ఆపని చేయడం లేదన్నదే ప్రశ్నే. అయితే పార్టీలో సైతం అధినేతకు నాయకులకు మధ్య ఒక లైన్ ఉంది. అదే సజ్జల రామక్రిష్ణారెడ్డి. ఇప్పుడు వైఎస్ కుటుంబం మధ్య దొంతరలను ఏర్పాటుచేసింది ఆయనే. అందుకే విజయమ్మ అంతటి మహిళ సజ్జల ఇంటికి వచ్చి మొర పెట్టుకోవాల్సి వచ్చింది.