Rythu Bharosa
Rythu Bharosa: ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. వీలైనంత త్వరగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. పాలనాపరంగా గాడిలో పడింది ప్రభుత్వం. ఇకనుంచి ఎన్నికల హామీలపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా ఫిబ్రవరి 6న కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోజు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల హామీలతో పాటు పాలనాపరంగా కొత్త నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగుల అంశాలపై చర్చించి.. నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ఎనిమిదవ పిఆర్సి కమిషన్ పై నిర్ణయం తీసుకోవడంతో ఏపీ సర్కార్ పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు మంత్రివర్గ సమావేశంలో దావోస్ పర్యటనకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. వార్షిక బడ్జెట్ పై సైతం నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది.
* ఫిబ్రవరి 6న మంత్రివర్గ సమావేశం
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 15 రోజులకు మంత్రివర్గ సమావేశం( Cabinet meeting ) నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 6న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కానుంది. దావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులు, ఏపీలో ఏర్పాటు కాబోయే సంస్థల గురించి చంద్రబాబు వివరించి అవకాశం ఉంది. ఇంకోవైపు అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, దయా ఫ్రమ్ వాల్ నిర్మాణం పై కూడా చర్చించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే కీలక అంశాలను చర్చించడమే కాదు సంక్షేమ పథకాల పైన కూడా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
* వాట్సాప్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు వాట్సాప్( WhatsApp) ద్వారా కీలకమైన ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపైన మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. అయితే ప్రధానంగా మాత్రం ఈసారి ఉద్యోగుల సమస్యలను తేల్చేయనున్నారు. ఉద్యోగులకు దాదాపు 26 వేల కోట్ల రూపాయల చెల్లింపులు బకాయి ఉంది. అందులో కొంతమేర చెల్లించేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. పెండింగ్ డీఏ పై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఒక విడత చెల్లింపునకు ఆమోదించే అవకాశం ఉంది. పనిలో పనిగా పిఆర్సి ఏర్పాటుపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్న ఉద్యోగుల సమస్యలు పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే దీనిని ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకొని చర్చించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
* ఫిబ్రవరిలో రైతు భరోసా
రైతు భరోసా( raitu Bharosa ) పథకం పై ఒక నిర్ణయానికి రానున్నారు. పథకం అమలుకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు సాగు ప్రోత్సాహం కింద 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం పీఎం కిసాన్ కింద ఏడాదికి ఆరువేల రూపాయల నగదు సాయం చేస్తోంది. దానికి మరో 14 వేల రూపాయలు జతచేస్తూ అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఎంత మంది అర్హులు అని లెక్క తేలింది. వైసిపి హయాంలో రైతు భరోసా పేరిట ఈ పథకం అమలు చేశారు. ఇప్పుడు దానిని అన్నదాత సుఖీభవ పథకంగా మార్చనున్నారు. ఫిబ్రవరిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేలా ముహూర్తం ఫిక్స్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనం గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే విద్యా సంవత్సరం ప్రారంభం జూన్ లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో.. నిధులు జమ చేసే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన అన్నదాత సుఖీభవ విడుదల కానుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.