Rushikonda Beach: రుషికొండ బీచ్ కు( rushikonda beach ) తిరిగి పూర్వ వైభవం దక్కింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమా అని పర్యాటక ప్రాంతంగా ఉన్న రుషికొండ ఆనవాళ్లు కోల్పోయింది. పచ్చని తివాచీ పరిచే విధంగా ఉండే ఈ కొండను ధ్వంసం చేసి నిర్మాణాలు జరిపింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం అక్కడ చేపట్టిన నిర్మాణాలు ఎందుకని కూడా చెప్పలేకపోయింది. దాదాపు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. ఇప్పుడు ఆ నిర్మాణాలను ఏం చేస్తారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రత్యామ్నాయంగా వాడుకుంటారని మాత్రం తెలుస్తోంది. మరోవైపు రుషికొండ బీచ్ కు తిరిగి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు దక్కింది. కొద్దిరోజుల కిందట ఈ గుర్తింపును రద్దు చేసింది సదరు సంస్థ. కానీ 20 రోజులు కాకమునుపే తిరిగి పునరుద్ధరించడం విశేషం.
Also Read: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వారంలో ఒకరోజు ఎంజాయ్!
* అదో ప్రత్యేక గుర్తింపు..
బ్లూ ఫ్లాగ్ ( blue flag)గుర్తింపు అంటే అదో ప్రత్యేక గుర్తింపు అన్నది ఒక లెక్క. ఈ గుర్తింపు ఉన్న బీచ్ లకు విదేశీ పర్యటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఫలితంగా ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే విదేశీ పర్యటకులు రావాలంటే ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలో ఉండాలి. కానీ గతంలో రుషికొండ బీచ్ లో పరిశుభ్రతకు పెద్దపీట వేసేవారు. పరిశుభ్రత, ఇతర భద్రతా చర్యలను పరిశీలించిన డెన్మార్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కేటాయించింది. ఈ గుర్తింపు కింద ఆ సంస్థ అందజేసే బ్లూ జెండాను బీచ్ ఎంట్రన్స్ లోనే ప్రదర్శిస్తారు. కానీ గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం బీచ్ నిర్వహణను గాలికి వదిలేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
* ఆ ఫిర్యాదులతోనే..
అయితే ఇక్కడ బీచ్ నిర్వహణను పర్యాటక శాఖ ( tourism department)పట్టించుకోవడం లేదంటూ సదరు డెన్మార్క్ సంస్థకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. అక్కడ మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేదు. బీచ్ లో వీధి కుక్కల స్వైర విహారం పెరిగింది. అందుకు సంబంధించి ఫోటోలను తీసిన కొందరు డెన్మార్కు సంస్థకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఆ సంస్థ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా తొలగించింది. దీంతో పర్యాటక శాఖ అధికారులు అక్కడ ఆ జెండాను తొలగించాల్సి వచ్చింది. అయితే దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పర్యాటక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో బీచ్ నిర్వహణ పనులు సక్రమంగా జరగడంతో.. సదరు సంస్థ మళ్ళీ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును ఇచ్చింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ గుర్తింపు పునరుద్ధరణకు నోచుకోవడం విశేషం.