RK Roja Arrest: మాజీ మంత్రి రోజా( RK Roja) అరెస్టు తప్పదా? వారం రోజుల్లో ఆమె అరెస్టు ఉంటుందా? కూటమి నేతలు చెబుతున్న మాటల్లో నిజం ఎంత? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది. శాప్ చైర్మన్ గా ఉన్న రవి నాయుడు అనే నేత రోజా అరెస్టు ఉంటుందని ప్రకటన చేశారు. వారం రోజుల్లో ఆమె అరెస్టు తప్పదని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. వైసిపి హయాంలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో భారీ అవినీతి జరిగిందన్నది కూటమి ప్రభుత్వం అనుమానం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై విజిలెన్స్ విచారణ కూడా చేపట్టింది. అన్ని జిల్లాల నుంచి వివరాలు సేకరించింది. అయితే పోటీల నిర్వహణ, క్రీడాకారుల నజరానాలు, క్రీడా పరికరాలకు కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలింది. దీనికి బాధ్యులను చేస్తూ మాజీమంత్రి ఆర్కే రోజాతో పాటు అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నంలో ఉంది కూటమి. తప్పకుండా మాజీ మంత్రి రోజా అరెస్టు ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నం అయినట్లు తెలుస్తోంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విచారణ పూర్తయింది. 40 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు విజిలెన్స్ ఎంక్వైరీలో తేలినట్లు సమాచారం.
పక్కా ఆధారాలతో..
అయితే మహిళా నేతగా ఉన్న రోజా అరెస్టు విషయంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వైసిపి హయాంలో చాలా దూకుడుగా ఉండేవారు రోజా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవారు. ఈ క్రమంలోనే ఆమెపై ఒక రకమైన నెగిటివ్ ప్రభావం కూడా ఉంది. ఆమె తీరుపై ప్రజల్లోనే భిన్నాభిప్రాయం ఉంది. అందుకే ఆమె అరెస్టు విషయంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదని.. ప్రజల్లో నెగిటివ్ అనేది ఉండదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే రోజా అరెస్టు జరిగితే వైసిపి దానిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధపడుతోంది. కానీ కూటమి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రాలో ప్రతి జిల్లాలో జరిగిన అవినీతిని పక్కా ఆధారాలతో బయట పెట్టేందుకు అన్ని రకాల సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అంచనా తప్పు?
వాస్తవానికి తన విషయంలో అరెస్టు ఉండదని రోజా భావించారు. మహిళా నేతగా తనవరకు వస్తే కూటమి ప్రభుత్వంపై నెగిటివ్ వస్తుందని అంచనా వేసుకున్నారు. కానీ ఆడుదాం ఆంధ్రాలో రోజా అవినీతిని కళ్లకు కట్టినట్లు ఆధారాలతో చూపించి.. అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే విజిలెన్స్ నివేదికను ఆధారంగా చేసుకుని ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారా? లేకుంటే సిఐడి ద్వారా అరెస్టుకు చర్యలు తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. రోజాను అరెస్టు చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె మాజీ మంత్రి కాబట్టి. అయితే రోజా విషయంలో కొద్ది రోజులపాటు ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..