RK Roja : తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలోని టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా అనేక మంది ఇతర నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తిరుపతిలోని పద్మావతి పార్క్, విష్ణు నివాసంలో బుధవారం రాత్రి ఈ విషాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఆరుగురు మరణించారు. వారిలో ఐదుగురు మహిళలు. 41 మంది గాయపడ్డారు. వారందరినీ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SWIMS), శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా ఆసుపత్రులకు తరలించారు. వారిని పరామర్శించేందుకు మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయనతో పాటు మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుపతికి చేరుకున్నారు. పద్మావతి మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించే క్రమంతో పోలీసులు వైఎస్ జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
కొండ మీద ఇప్పటికే పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ఉండడంతో రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో వారు వెళ్లిపోయిన తర్వాత రావాలంటూ అధికారులు జగన్, రోజాలకు సూచించారు. ఈ క్రమంలోనే తిరుచానూరు క్రాస్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అరగంట తర్వాత వెళ్లాలని పోలీసులు చెప్పిన వినకుండా తిరుచానూరు క్రాస్ వద్ద తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం వదిలి నడుచుకుంటూనే కాలినడకన బయలు దేరారు జగన్మోహన్ రెడ్డి.. అయితే కొద్ది దూరం నడిచిన వెళ్లిన వైఎస్ జగన్ ఆపై స్థానిక నేత కారులో తిరుపతికి వెళ్లిపోయారు.
వైఎస్ జగన్ వెళ్లే లోపు బాధితులను తరలించే యోచనలో ఉన్న అధికారులు ఉన్నట్లు ఆరోపించారు. దానిలో భాగంగా ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నట్లు ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆ క్రమంలోనే అరగంట, గంట అంటూ ఏవో సంబంధం లేని కారణాలను తెలియజేసే యత్నం చేశారని తెలిపారు. ఇవేవీ పట్టించుకోని వైఎస్ జగన్.. బాధితులను పరామర్శించడానికి బయల్దేరారు. వాళ్లు వెళ్తున్న మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్‌కే రోజాలు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆర్కే రోజా వైసీపీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు.
తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం చూశామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.. చంద్రబాబు అసమర్థత ఈ ఘటనతో స్పష్టమైందంటూ విమర్శలు గుప్పించారు. ఘటనకు కారణమెవరో కనుక్కోకుండా నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భక్తులకు కనీస సదుపాయాలు లేవు.. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలంటూ విమర్శించారు.