AP Liquor Policy: ఏపీ ప్రభుత్వం( AP government) మందుబాబులకు మరో శుభవార్త అందించనుంది. పర్మిట్ రూములకు తిరిగి అనుమతి ఇవ్వాలనే ఆలోచనలు ఎక్సైజ్ శాఖ ఉంది. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పర్మిట్ రూములను రద్దు చేయడంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. అదే సమయంలో మందుబాబులు రహదారుల పక్కన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ పునరాలోచనలో పడింది. తిరుపతిలో జరిగిన ఎక్సైజ్ శాఖ ఉన్నత స్థాయి సమీక్షలు దీనిపై విస్తృతంగా చర్చ జరిపారు. దీంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. పర్మిట్ రూములు అందుబాటులోకి వస్తే కొన్ని రకాల ఇబ్బందులు తప్పడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
Also Read: ఆక్వాకు ఏపీ ప్రభుత్వం ఊపిరి!
* కొత్త మద్యం పాలసీలో..
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని ప్రకటించింది. వైసిపి హయాంలో ఏర్పాటు అయిన ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసింది. 2024 అక్టోబర్ నుంచి ఏపీలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపుల టెండర్లు దక్కాయి. వారికి లాటరీ పద్ధతిలో లైసెన్స్ జారీ చేశారు. అయితే సాధారణంగా లిక్కర్ షాపుల వద్ద మద్యం తాగేవారు… అక్కడే కొనుగోలు చేసి తాగడానికి ఇష్టపడతారు. అయితే పర్మిట్ రూములు లేకపోవడంతో మందుబాబులు రహదారుల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఎక్కువగా మద్యం తాగుతున్నారు. తద్వారా జనజీవనానికి ఇబ్బందికరంగా మారుతుంది. సహజంగా మద్యం షాపులు పట్టణాల్లోనూ.. పల్లెల్లోనూ జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. పర్మిట్ రూములు లేకపోవడం వల్ల బహిరంగంగా తాగుతుండడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. అందుకే పర్మిట్ రూములు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
* తాగేందుకు గది..
పర్మిట్ రూమ్( permit room ) అంటే మద్యం తాగేందుకు షాపు పక్కన ఉండే చిన్నపాటి గది. అక్కడ కుర్చీలు, బల్లలు వంటి ఏర్పాట్లు ఉండవు. కేవలం నిల్చుని మద్యం తాగేందుకు అనుమతి ఉంటుంది. అలాగే వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు, స్నాక్స్ వంటి అందుబాటులో ఉంచుతారు. ఈ పర్మిట్ రూముల ద్వారా లిక్కర్ షాపు యజమానులకు అదనపు ఆదాయం సమకూరేది. అదే సమయంలో ప్రభుత్వం సైతం పర్మిట్ రూమ్ అనుమతికి ఐదు ఐదు లక్షల రూపాయలు వసూలు చేసేది.
* వైసీపీ హయాంలో రద్దు..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద ఈ పర్మిట్ రూములను రద్దు చేశారు. అయితే మద్యం పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. అదేవిధంగా అనుసరించింది. అయితే ప్రభుత్వానికి ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఏపీలో మొత్తం 3,500 వరకు లిక్కర్ షాపులు ఉన్నాయి. పర్మిట్ రూమ్ లైసెన్సుల జారీ ద్వారా ఒక్కో దాని నుంచి ఐదు లక్షల ఆదాయం వచ్చేది. ఏడాదికి 175 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరేది. అయితే పర్మిట్ రూములకు అనుమతి ఇస్తే లిక్కర్ షాపులు చిన్నపాటి బార్లుగా మారే అవకాశం ఉందని వారికి అనుమతి ఇవ్వలేదు. అయితే తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.