RK Roja Arrest Details: మాజీ మంత్రి రోజా( RK Roja) చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అరెస్టు తప్పదా? ఆగస్టులోనే అరెస్టు చేస్తారా? అన్ని ఏర్పాట్లు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆడుదాం ఆంధ్ర లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అండ్ ఫోర్స్ మెంట్ విచారణ చేయిస్తున్నామని.. కొద్ది రోజుల్లో నివేదిక అందుతుందని స్పష్టం చేశారు. తద్వారా అరెస్టుల పర్వం కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు. స్పష్టమైన సంకేతాలు పంపారు. ఇప్పటికే మంత్రి రోజా చుట్టూ భారీ ప్రచారం నడుస్తోంది. తాజాగా మంత్రి ప్రకటనతో రోజా అరెస్టు తప్పదని తేలిపోయింది.
దూకుడు కలిగిన నేత..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో దూకుడు కలిగిన నేతల్లో రోజా ఒకరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడేవారు. నారా లోకేష్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేసేవారు. మంత్రిగా ఉన్న సమయంలో నోటికి అడ్డు అదుపు లేకుండా అడ్డగోలుగా మాట్లాడే వారన్న విమర్శలు రోజాపై ఉన్నాయి. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రోజా అరెస్టు ఉంటుందని ప్రచారం నడిచింది. అయితే ఒక మహిళ నేతను అరెస్టు చేసే సమయంలో దానికి సహేతుకమైన కారణం చూపాలి. అందుకే బలమైన కారణాలను అన్వేషించే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఆమె హయాంలో జరిగిన అవినీతి పై రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ విచారణను చేపడుతోంది.
భారీగా అవినీతి..
2024 సంక్రాంతికి ముందు రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర( Aadudham Andhra) , సీఎం కప్పు పేరిట క్రీడా పోటీలు నిర్వహించింది నాటి వైసిపి ప్రభుత్వం. అప్పట్లో క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉండేవారు. అయితే అప్పట్లో ఈ క్రీడల నిర్వహణకు సంబంధించి దాదాపు రూ.100 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల ఆటలు ఆడించకుండానే ఆడించినట్టు.. మరి కొన్ని చోట్ల క్రీడా పోటీలకు సంబంధించిన నిర్వహణ ఖర్చులు.. క్రీడా సామాగ్రిలో నాసిరకం వంటి వాటిని పంపిణీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో వాలంటీర్ల పర్యవేక్షణలోనే పోటీలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. ముఖ్యంగా సీనియర్ క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఉమ్మడి జిల్లాల్లో విజిలెన్స్ విచారణ కొనసాగింది. క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు విజిలెన్స్ అధికారులు. సమగ్ర నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందించారు. దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న నిర్ధారణకు వచ్చింది ప్రభుత్వం.
Also Read: డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. ఆ డ్రైవర్ ముందు చూపునకు హ్యాట్సాఫ్!
పక్కా ఆధారాలతో..
అయితే ఒకవైపు విజిలెన్స్ విచారణ( Vigilance enquiry) జరుగుతున్నా రోజా తీరులో మార్పు రాలేదు. ఒక మహిళా నేతగా తనను అరెస్టు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని.. అందుకే తనను అరెస్టు చేసుకోవచ్చు అన్నట్టుగా ఆమె మాట్లాడారు. అయితే విజిలెన్స్ సమగ్ర విచారణ లో జరిగిన అవినీతిని ప్రజల ముందు ఉంచి.. అందుకు బాధ్యురాలైన అప్పటి మంత్రి రోజాను అరెస్టు చేస్తారని తెలుస్తోంది. అందులో భాగంగానే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. మొత్తానికి అయితే రోజా అరెస్టు తప్పదని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లు అయింది.