https://oktelugu.com/

RK Kothapaluku :చంద్రబాబు పాలన.. క్షణం తీరికలేదు. దమ్మిడి ఆదాయమూ లేదు..

ఆ పస లేదు. ఘాటు వాసన లేదు. మాల్ మసాలా అసలు లేదు.. ప్రాస కోల్పోయిన త్రివిక్రమ్ మాటలాగా.. పంచ్ కోల్పోయిన పూరి జగన్నాథ్ సినిమా లాగా.. డ్రామా మిస్సయిన రాజమౌళి సన్నివేశం లాగా.. సాగిపోయింది ఈ వారం కొత్తపలుకు. అలియాస్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ రాసే కొత్త పలుకు.

Written By: , Updated On : December 15, 2024 / 07:00 PM IST
RK Kothapaluku

RK Kothapaluku

Follow us on

RK Kothapaluku : రాధాకృష్ణ జర్నలిజంలో బ్యూటీ ఏంటంటే.. స్వతహాగానే అతడు పాత్రికేయుడు. చాలా సంవత్సరాల క్రితం పాత ఆంధ్రజ్యోతి పత్రికలో అతడు టిడిపి బీట్ రిపోర్టర్. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయో అతడికి. పైగా రాజకీయ నాయకులతో అతనికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అంతటి వైసిపి నాయకులలోనూ కొంతమంది రాధాకృష్ణకు అత్యంత సన్నిహితులంటే అతడి చాణక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అందువల్లే తనకు తెలిసిన లోగుట్టును.. బహిర్గతం చేయడంలో రాధాకృష్ణ ఏమాత్రం వెనుకడుగు వేయడు. పైగా తన పంచ్ ఆఫ్ రైటింగ్ తో అదరగొడుతుంటాడు. వాటిని బహిర్గత పరచడంలో ఏమాత్రం వెనకడుగు వేయడు. ఇది కొంతమందికి నచ్చకపోయినా.. రకరకాల విమర్శలు వస్తున్నా జానే దాన్ అనుకుంటూ రాధాకృష్ణ.. తన స్టైల్ ఆఫ్ రైటింగ్ తో ముందుకు వెళుతూనే ఉంటాడు.

అది మిస్ అయింది పుష్పా

రాధాకృష్ణ.. తను రాసే కొత్త పలుకు వ్యాసంలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. సమాజంలోని ప్రజలకు తెలియని ఏదో ఒక విషయం దాగి ఉంటుంది. కానీ ఈ ఆదివారం రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ మిస్ అయింది. అసలు దాని గురించి కొత్త పలుకులు ఉలుకు పలుకు లేదు. కేటీఆర్ ఫార్ములా కారు రేసు వ్యవహారం ప్రస్తావన లేదు. అన్నింటికీ మించి కేసీఆర్ ఈ మధ్య రెండుసార్లు నాయకులతో చేసిన రివ్యూ మీటింగ్లకు సంబంధించిన చర్చ కూడా లేదు. మొత్తంగా తనకు నచ్చిన.. తాను మెచ్చిన చంద్రబాబు ప్రస్తావన మాత్రమే ఈ వారం కొత్త పలుకులో ఉంది. అదికూడా ఆరు నెలల చంద్రబాబు పరిపాలనపై పోస్టుమార్టం నివేదిక లాగానే రాధాకృష్ణరాస్కొచ్చాడు. నాయకుడుంటే నరేంద్ర మోడీ లాగా ఉండాలని.. అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ లాగా ఎదిరించాలని చంద్రబాబుకు రాధాకృష్ణ హితబోధ చేశాడు. నరేంద్ర మోడీ ప్రశాంతంగా ఉంటారని.. చేయాల్సిన టైంలోనే పనులు చేస్తుంటారని.. అంతేతప్ప పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో.. గంటల తరబడి కూర్చొని.. అధికారులను వేధించి ఇబ్బంది పెట్టరని రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు. ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబులో పాతవాసనలు పోలేదని.. స్వర్ణాంధ్ర 2047 వంటి వాటితో ఉపయోగం లేదని.. భవిష్యత్తు ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని రాధాకృష్ణ సూక్తి ముక్తావళిని వినిపించాడు. ఇలా గంటల తరబడి అధికారులతో సమావేశాలు అంటూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అంటూ కాలయాపన చేస్తే “క్షణం తీరికలేకుండా.. దమ్మిడి ఆదాయం లేకుండా” వ్యవహారం సాగుతుందని రాధాకృష్ణ కుండ బద్దలు కొట్టాడు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసిపి నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని.. అన్యాయాలు చేశారని.. ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు టిడిపిలో చేరి అదే పంథాను కొనసాగిస్తున్నారని రాధాకృష్ణ వ్యాఖ్యానించాడు. ఇలా చంద్రబాబు పరిపాలన చుట్టూ మాత్రమే రాధాకృష్ణ పరిమితమయ్యాడు. మొత్తంగా ఏదో శుచి పచి చేయలేని వంటకాన్ని సిద్ధం చేశాడు. చివర్లో విజయసాయి రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చాడు.. చంద్రబాబునే చావాలని కోరుకుంటావా.. నువ్వు మనిషివేనా.. అంటూ శాపనార్ధాలు పెట్టాడు. అన్నట్టు వీరిద్దరూ ఆమధ్య ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. రాధాకృష్ణ తన పత్రికలో విజయసాయిరెడ్డి పై విరుచుకు పడితే… విజయసారెడ్డి ట్విట్టర్లో విమర్శలు చేశాడు.. ఆ ఎపిసోడ్ అంతటితోనే ఆగింది. దీన్ని ఇప్పుడు రాధాకృష్ణ మళ్లీ గెలికాడు.. చూడాలి మరి విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తాడో?!