RK Kotha Paluku: ఆరిపోయిన మంటను రేపడంలో.. మానిపోయిన గాయాన్ని గెలవడంలో కొంతమంది విపరితమైన ఇష్టాన్ని చూపిస్తుంటారు. అందులో ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణ ముందు వరుసలో ఉంటాడు. ఈ మాట అనడానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. భయపడాల్సిన పని అంతకంటే లేదు. వాస్తవానికి వేమూరి రాధాకృష్ణ ఒక సీనియర్ జర్నలిస్ట్. సమాజంలో జరుగుతున్న పరిణామాలను.. ప్రజల సమస్యలను.. ప్రజాప్రతినిధుల చీకటి వ్యవహారాలను బయట పెట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. పైగా ఆయన తన పేపర్ కు దమ్మున్న పత్రిక అనే ట్యాగ్ లైన్ కూడా జత చేశారు. అంతేకాదు తనను తాను దమ్మున్న జర్నలిస్టుగా చెప్పుకుంటారు.
ఆ స్థాయి విలువలు పాటించే వేమరి రాధాకృష్ణ ఆదివారం తన పత్రికలో రాసిన కొత్త పలుకు సంపాదకీయం బి గ్రేడ్ స్థాయిలో ఉంది. సినీ పరిశ్రమలో నటించే వారంతా ఎలా ఉంటారో అందరికీ తెలుసు. కథానాయికలు వేసుకునే దుస్తులు.. వారు చేసే ప్రదర్శన అంతా ఒకరకంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో నటీనటులు తమ ఒంటిమీద సోయి కూడా మర్చిపోతుంటారు. బి గ్రేడ్ స్థాయికి మించి దిగజారిపోతారు. వాస్తవానికి అటువంటి చోట విలువలు వెతుక్కోవడం అనేది అత్యంత మూర్ఖత్వం. పైగా అన్ని తెలిసి కూడా వారు అలా చేస్తుంటారు. దాని వెనుక ఏముంది? ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి? వారు అలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడరా? అనే ప్రశ్నలకు సమాధానం వెతకకపోవడమే మంచిది.
సినీ పరిశ్రమ అనేది గాజు మేడ లాంటిది. సహజంగానే దానికి విపరీతమైన రీచ్ ఉంటుంది. డబ్బు కూడా అదే స్థాయిలో సర్కులేట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు అందులో నటించే నటీనటులు కచ్చితంగా స్వేచ్ఛ విహంగాల మాదిరిగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి చోట విలువలు వెతుక్కోవడం.. వలువల గురించి చెప్పడం మూర్ఖత్వం ఏమవుతుంది. ఇటీవల నటుడు శివాజీ సామాన్లు అంటూ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత మంట పుట్టించాలో.. అంత మంట పుట్టించాయి. ఆయన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారు. అనసూయ, ప్రకాష్ రాజు, నాగబాబు లాంటివారు శివాజీకి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు వేమూరి రాధాకృష్ణ శివాజీకి అండగా నిలిచారు. గతంలో శివాజీ తన గరుడ పురాణం సోదిని మొత్తం ఏబీఎన్ లో కూడా చెప్పుకున్నాడు. బహుశా అందువల్లే ఆయనకు సపోర్ట్ గా ఉన్నాడేమో.. అయినప్పటికీ వస్త్రధారణ స్వేచ్ఛ మహిళా సాధికారతా? అంటూ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు సంపాదకీయం రాశారు. ప్రకాష్ రాజ్, నాగబాబు, ఇంకా కొంతమందిని ఆధునిక కందుకూరి వీరేశలింగం పంతుళ్ళుగా అభివర్ణించారు. వస్త్రధారణ స్వేచ్ఛను కోరుకునే ఆడవాళ్లను మరో విధంగా ఆయన పేర్కొన్నారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. గతంలో ఏబీఎన్ ఛానల్ ప్రారంభించినప్పుడు రాత్రిపూట ఎటువంటి కార్యక్రమాలు ప్రసారం చేసేవారో అందరికీ తెలుసు. న్యూస్ ఛానల్ అని పేరు పెట్టి.. రాత్రిపూట ఆ తరహా ప్రసారాలు చేయడం ఎటువంటి విలువలకు నిదర్శనమో.. విలువలు చెబుతున్నవారు వెల్లడించాలి. చెప్పేవన్నీ శనిగలు.. అమ్మేవన్నీ ఆముదాలు.. ఈ సామెత ఇప్పుడు వేమూరి రాధాకృష్ణ రాసిన సంపాదకీయానికి నూటికి నూరు పాళ్ళు కాదు.. కోటిపాళ్ళు సరిపోతుంది.