YCP: ఏపీలో గత ఐదేండ్లు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించిన వారిపై కేసుల పర్వం కొనసాగుతున్నది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలను తీవ్రంగా వేధించిన వారిపై కేసులు పెట్టి కటకటాల్లోకి పంపిస్తున్నారు. ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ ను అదుపులోకి తీసుకొని జైలుకు పంపించారు. ఇక సజ్జల భార్గవ్ సహా మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. నోటికి, చేతికి అడ్డూ అదుపు లేదన్నట్లుగా వ్యవహరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మరికొందరిపై కేసులు నమోదవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇష్టరాజ్యంగా వ్యవహరించిన అధికారులు, వైసీపీ నేతలపై ప్రభుత్వం కేసులు పెడుతున్నది. ఈ మేరకు స్థానిక నాయకులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు పారిపోయిన వారిని కూడా తీసుకొస్తున్నారు. ఇక మరికొందరు సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కూడా రాజకీయాల్లో దూరి ఇష్టమొచ్చినట్లు చెలరేగిపోయారు. ఇందులో ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఉన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు చెలరేగిపోయారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, వ్యూహం, ప్రతివ్యూహం సినిమాలతో వివాదాలను సృష్టించారు. ఏపీ మాజీ సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆయనపై కేసు నమోదైంది. మరోవైపు వైసీపీ నేతగా కొనసాగుతున్న సినీ నటుడు పోసానిపై కూడా కేసు నమోదైంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఇక మరో నటి శ్రీరెడ్డి కూడా టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సోషల్ మీడియా వేదికగా నోరు పారేసుకుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. ఇప్పుడు ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుండడంతో కొంత వెనక్కి తగ్గింది. తమ తప్పేమి లేదని, కేవలం వైసీపీలో కొందరి ఆదేశాల మేరకు కార్యకర్తలతో పాటు తాను ఇలా పోస్టులు పెట్టినట్లు చెప్పుకొచ్చింది.
ఇక ఒక్కొక్కరిగా వైసీపీ నేతలు కేసులతో సతమతమవుతున్నారు. మరోవైపు ఇక నెక్స్ టార్గెట్ ఎవరంటూ చర్చ జోరుగా సాగుతున్నది. పెద్దిరెడ్డి, సజ్జల, విజయసాయి తదితర నేతలకు కూడా ఉచ్చు తప్పేలా లేదు. ఇక అధినేత జగన్ పై ఎలాగో ఇప్పట్లో తేలని కేసులు ఎన్నో ఉన్నాయి. వాటిపై కూడా సీరియస్ గా ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది.
ఇప్పటికే కేసుల పరంపర
వైసీపీ సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన మహిళా నేతలపై ఇష్టమొచ్చినట్లు చెలరేగిపోయి అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టి కటకటాల్లోకి పంపిస్తున్నది. నాడు తమకు అడ్డెవరూ అన్నట్లు ప్రవర్తించిన వారిపై నేడు ఉక్కుపాదం మోపుతున్నది. మహిళలను అసభ్యంగా వేధించినవారిని, ప్రభుత్వంపై దుష్ర్పచారం చేసిన వారిని వదిలిపెట్టబోమని ఇటీవలే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అవసరమైతే తానే హోంశాఖ తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం వెనుక ప్రభుత్వం ఎంత ఆగ్రహంగా ఉందో తెలియజెప్పుతున్నది. హోం శాఖ మంత్రి అనిత కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నది. క్రైం కంట్రోల్ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక లేడీ హోం మినిస్టర్ ఇలా పని చేయడం ఇదే మొదటిసారి అంటూ సర్వత్రా అభిప్రాయం వినిపిస్తున్నది.