IAS Officer Praveen Prakash :  జగన్ వీరవిధేయ అధికారికి తప్పని జైలు కష్టాలు

వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పిదాలకు అధికారులు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. సీనియర్ అధికారుల సైతం ఎటువంటి పోస్టులు లేకుండా సాధారణ పరిపాలన శాఖలో ఉన్నారు. కొంతమంది స్వచ్ఛంద పదవీ విరమణ కు దరఖాస్తు చేసుకున్నారు. అటువంటి వారికి సైతం కేసులు వెంటాడుతుండడం విశేషం.

Written By: Dharma, Updated On : October 3, 2024 11:48 am

IAS Officer Praveen Prakash

Follow us on

IAS Officer Praveen Prakash : గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలామంది అధికారులు వీర విధేయతతో పనిచేశారు. సాధారణంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా అధికారులు పనిచేస్తారు. అటువంటి అస్మదీయ అధికారులను ప్రభుత్వ పెద్దలు నియమించుకుంటారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి అధికారుల బృందం మారడం పరిపాటి. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో మంత్రుల కంటే కొంతమంది అధికారుల కే అధిక ప్రాధాన్యం ఇచ్చారు జగన్. అయితే అప్పటి ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛతో కొంతమంది అధికారులు రెచ్చిపోయారు. విమర్శలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మూల్యం చెల్లించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు లుప్ లో పెట్టింది. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయమంది. కనీసం అప్రధాన్య పోస్టులు కూడా కేటాయించలేదు. అయితే ఇందులో గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించినందుకు కేసులు నమోదైన వారు ఉన్నారు. దీంతో వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఈ జాబితాలో ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్. రెండు రోజుల కిందటే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. అయితే తాజాగా ఓ కేసులో హైకోర్టు ఆయనకు నెలరోజుల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. జగన్ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ప్రవీణ్ ప్రకాష్. జగన్ కు అత్యంత విధేయుడుగా మెలిగారు. జగన్ ఆదేశిస్తే నిబంధనలతో సంబంధం లేకుండా పని చేస్తారని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

* కోర్టు ఆదేశాలు ధిక్కారం
వైసిపి హయాంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 ఏళ్లకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2022లో ఇంటర్ బోర్డులో విజయలక్ష్మి అనే ఉద్యోగి 60 ఏళ్లకు రిటైర్ అయ్యారు. అప్పటి వైసీపీ ప్రభుత్వ నిర్ణయంతో మరో రెండేళ్లపాటు తన సర్వీసును పొడిగించాలని ఆమె కోరారు. అయితే దీనికి విద్యాశాఖ ఒప్పుకోలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఆమె సర్వీసును పొడిగించాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్న శేషగిరి బాబు కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. కంపెనీ చట్టం కింద ఏర్పడిన ఇంటర్ బోర్డు ఉద్యోగులకు 62 ఏళ్ల పదవీ విరమణ నిబంధన వర్తించదని వాదించారు. దీంతో ఆమె కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.

* నెల రోజుల జైలు శిక్ష
తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇంటర్ బోర్డు ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనన్న విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రయోజనాలు పొందవచ్చు అని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయని ప్రవీణ్ ప్రకాష్, శేషగిరి బాబుకు నెల రోజులు జైలు, రెండు వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. అయితే చిన్నపాటి వెసులుబాటు ఇచ్చింది. హైకోర్టులో ఆపీలు చేసుకునేందుకు వీలుగా నాలుగు వారాలపాటు శిక్షను వాయిదా వేసింది.