AP Constable Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. కానిస్టేబుళ్ల నియామకం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వైసీపీ సర్కార్ విడుదల చేసిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు సంబంధించి ప్రక్రియ ముందుకు కదలలేదు. తమ ప్రభుత్వ హయాంలో నియామక ప్రక్రియ పూర్తి చేయలేక పోయింది వైసిపి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పని చేస్తోంది. 2022 నవంబర్ చివరి వారంలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 4.58 లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 2023 జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ నిర్వహించారు. 95,208 మంది అర్హత సాధించినట్లు బోర్డు ప్రకటించింది. తొలి దశలో ప్రాథమిక రాత పరీక్ష పూర్తయ్యాక రెండో దశలో దేహదారుధ్య పరీక్షలు, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. 2023 మార్చి 13 నుంచి 20 దాకా నిర్వహిస్తామని హాల్ టికెట్లు కూడా జారీచేసింది అప్పటి ప్రభుత్వం. కానీ ఆ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయలేక పోయింది. రకరకాల కారణాలు చెబుతూ వాయిదా వేస్తూ వస్తోంది. ఇప్పుడు దానిని పూర్తిచేసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం.
* ఈనెల 30 నుంచి ఈవెంట్స్
అప్పట్లో 95,208 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే.వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది కూటమి ప్రభుత్వం. ఈనెల 29 వరకు ఆన్లైన్లో వారికి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు 13 ఉమ్మడి జిల్లాల్లో రెండో దశ పరీక్షలు కొనసాగనున్నాయి. వారికి దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. అర్హత సాధించిన వారికి తుది విడత రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏడాదిన్నర కాలంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియ.. ఇప్పుడు వేగంగా ముందుకు కదలనుంది.
* హోంగార్డులకు రిజర్వేషన్లు
అయితే అప్పట్లో నోటిఫికేషన్ విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం సివిల్ హోంగార్డులకు 15%, ఏపీఎస్పీ హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. దీని ప్రకారం మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల్లో.. 1100 హోం గార్డులకి కేటాయించాలి. అయితే ప్రాథమిక పరీక్షను మూడువేల మంది హోంగార్డులు రాయగా.. ఫలితాల తర్వాత 382 మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో తాజాగా హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టింది కోర్ట్. కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో హోంగార్డుల రిజర్వేషన్ అంశంపై కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితా తయారీ పూర్తిచేయాలని స్పష్టం చేసింది.