AP Intermediate: ఇంటర్మీడియెట్ ప్రతీ విద్యార్థి జీవితంలో అత్యంత కీలక దశ. భవిష్యత్‌ను నిర్దేశించేది.. లక్ష్యన్ని ఎంచుకునేది ఇక్కడే. అందుకే ఈ దశలో పిల్లలు మంచి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులు, అధ్యాపకులు చర్యలు తీసుకుంటారు. అయితే పదేళ్ల పాఠశాల విద్య తర్వాత కాలేజీ జీవితం ప్రారంభం కావడం, యవ్వన దశకు చేరుకోవడంతో చాలా మంది విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు. ఇంటర్ సిలబస్(Sylabas), పరీక్షల(Exams) విధానం కూడా విద్యార్థుల వెనుకబాటుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఇంటర్మీడియెట్‌లో సంస్కరణలు చేయాలని భావిస్తోంది. సీబీఎస్‌ఈ తరహాలోనే రెండేళ్ల కోర్సులో ఒకేసారి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. సీబీఎస్‌ఈలో 11వ తరగతికి పబ్లిక్ పరీక్షలు లేవు. 12వ తరగతిలో మాత్రమే ఉంటాయి. ఈ మార్కులనే ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే ఏపీ ఉన్నత విద్యా మండలి కూడా సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షల విధానంలో సంస్కరణలు చేయాలన్న ఆలోచనలో ఉంది.
తల్లిదండ్రుల అభిప్రాయం మేరకే..
అయితే ఈ సంస్కరణలను ఏకపక్షంగా తీసుకోకూడదని భావిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అభిప్రాయ సేకరణ ప్రక్రియ జనవరి 8 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. జనవరి 26 వరకు అభిప్రాయ సేకరణే జరుగుతుంది. ఒకేసారి పరీక్షలు నిర్వహించడం వలన విద్యార్థులు చదువుకునేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని భావిస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుందని, ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌లో కూడా మార్పులు చేయాలని భావిస్తోంది.
విద్యా సంవత్సరం కూడా..
ప్రస్తుతం జూన్ 1 నుంచి మార్చి వరకు విద్యాసంవత్సరం(Educational Year) కొనసాగుతుంది. ఏప్రిల్, మే నెలల్లో కాలేజీలకు సెలవులు ఇస్తున్నారు. ఇకపై వేసవి సెలవులను విద్యా సంవత్సరం మధ్యలోకి తీసుకురావాలని ఇంటర్ విద్యాశాఖ భావిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి 24 వరకు తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత వేసవి సెలవులు ఇచ్చి.. జూన్ 1న కాలేజీలు తిరిగి తెరుస్తారు. వేసవి సెలవులకు ముందు పూర్తి చేసిన సిలబస్ నుంచి బోధన కొనసాగిస్తారు.