Dharmana Ram Manohar Naidu: ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు సైలెంట్ గా ఉన్నారు. వైసీపీలో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆయన పార్టీకి దూరమవుతారని ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని టాక్. మరోవైపు ఆయన కుమారుడు జనసేనలో చేరతారని తాజాగా ఒక ప్రచారం ప్రారంభం అయింది. వాస్తవానికి ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు తప్పుకోవడానికి ముందుకు వచ్చారు. తన బదులు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కు ఛాన్స్ ఇవ్వాలని జగన్ ను కోరారు. కానీ జగన్ అందుకు అంగీకరించలేదు. ఈ ఎన్నికల్లో అయీష్టంగానే పోటీ చేశారు ధర్మాన ప్రసాదరావు. సిట్టింగ్ మంత్రిగా ఉంటూ ఓ సామాన్య సర్పంచ్ చేతిలో ఓడిపోయారు. ఏకంగా 52,000 ఓట్ల తేడాతో గొండు శంకర్ అనే యువకుడు ధర్మాన ప్రసాదరావును ఓడించారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు ధర్మాన. వాస్తవానికి శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా బలమైన నియోజకవర్గం. కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం ఎక్కువ. ఆపై జిల్లా కేంద్రం కావడంతో ఒక రకమైన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీలో చేరడం ఉత్తమమని ధర్మాన ప్రసాదరావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టిడిపిలో చేరితే సముచిత స్థానంతో పాటు రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. అందుకే ధర్మాన ప్రసాదరావు గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. వైసీపీలో యాక్టివ్ గా లేరు. కనీసం రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. జగన్ సైతం ధర్మానను పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.
* జనసేన జిల్లా బాధ్యతల కోసం
అయితే తాజాగా ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు జనసేనలో చేరతారని ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో జనసేనకు ప్రాతినిధ్యం లేదు. జిల్లా బాధ్యతలు చూసుకునేవారు సైతం లేరు.దీంతో ధర్మాన కుటుంబం జనసేనలో చేరితే జిల్లా బాధ్యతలు వారికి అప్పగించే అవకాశం ఉంది.మరోవైపు కూటమిపరంగా ధర్మాన ప్రసాదరావుకు సరైన గౌరవం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.అందుకే ధర్మాన ముందుగా తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడును జనసేనలోకి పంపిస్తారని టాక్ మొదలైంది. ఇప్పటికే కింజరాపు కుటుంబంతో ధర్మాన ప్రసాదరావుకు మంచి అనుబంధం ఉంది. భవిష్యత్తులో శ్రీకాకుళం నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తారని.. అప్పుడు ధర్మాన వారసుడికి ప్లాట్ ఫామ్ దక్కుతుందని భావిస్తున్నట్లు సమాచారం.
* జగన్ నాయకత్వంపై విముఖత
ధర్మాన ప్రసాదరావు పూర్తిగా రాజకీయ వైరాగ్యంలో ఉన్నారు. అయితే ఆయన ఆది నుంచి జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ నుంచి బయటపడాలని భావిస్తున్నారు. కానీ సరైన మార్గం దక్కలేదు. మరోవైపు కుమారుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వలేకపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగితే కుమారుడి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారుతుంది. అందుకే ధర్మాన ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడే పార్టీలో చేరాలని భావిస్తున్నారు. మొత్తానికి అయితే వైసీపీ నుంచి ఓ సీనియర్ నేత బయటకు రావడం ఖాయమని తేలుతోంది.