Visakha MLC Election: విశాఖ విషయంలో వైసీపీ అంచనాలు తప్పుతున్నాయి.పార్టీ ఆవిర్భావం నుంచి విశాఖపట్నం పట్టు సాధించడానికి జగన్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.2014 ఎన్నికల్లో తన తల్లి విజయమ్మను విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించారు జగన్. కానీ ఆమె బిజెపి అభ్యర్థి హరిబాబు చేతిలో ఓడిపోయారు.ఆ పరాభవాన్ని జగన్ తట్టుకోలేక పోయారు.అందుకే కొణతాల రామకృష్ణ లాంటి నేతను పక్కన పెట్టారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచినా.. విశాఖలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఉనికి చాటుకుంది. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలను ఆ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి సైతం స్వల్ప మెజారిటీతోనే గెలవగలిగారు. అప్పట్లో జనసేన భారీగా ఓట్లు చీల్చడంతో గ్రామీణ నియోజకవర్గాల్లో సైతం వైసిపి గెలవగలిగింది. జగన్ ఎంతగానో విస్మయం చెందారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ విశాఖ వేదికగా రాజకీయాలు చేయడం ప్రారంభించారు. అమరావతిని నిర్వీర్యం చేశారు. పాలనా రాజధానిగా విశాఖపట్నం ప్రకటించారు. అయినా సరే విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్రవాసులు ఈ నిర్ణయాన్ని స్వాగతించలేదు. వైసీపీని ఆదరించలేదు. ఇది 2023 మార్చిలోనే స్పష్టమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే టిడిపికి టర్నింగ్ పాయింట్ కూడా అదే. కానీ ఎన్నికల్లో అయితే వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో 40 వేల పైచిలుకు మెజారిటీలు నమోదయ్యాయి తెలుగుదేశం పార్టీకి. గాజువాకలో అయితే ఏకంగా 95 వేల మెజారిటీతో టిడిపి అభ్యర్థి గెలిచారు.
*:నాన్ లోకల్ నాయకుల వల్లే
విశాఖ జిల్లా విషయంలో జగన్ ఆలోచన మరోలా ఉంటుంది. ముఖ్యంగా నాన్ లోకల్ నాయకులను బలవంతంగా రుద్దడం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో తన తల్లి విజయమ్మను పోటీగా నిలబెట్టారు. అప్పట్లో టిడిపి రాయలసీమ సంస్కృతిని తెరపైకి తెచ్చింది. 2019లో సైతం ఎం వివి సత్యనారాయణ ను ఎంపీగా పోటీ చేయించారు. ఆయనపై సైతం నాన్ లోకల్ ముద్ర ఉంది. అయినా సరే ఆ ప్రభంజనంలో కొద్దిపాటి ఓట్లతో ఎంపీగా గెలవగలిగారు. ఈ ఎన్నికల్లో పొరుగు జిల్లాకు చెందిన బొత్స ఝాన్సీ లక్ష్మిని ఎంపీగా పోటీ చేయించారు. ఆమె సైతం ఓడిపోయారు.
* సీనియర్లు ఉన్నా..
విశాఖ జిల్లాలో వైసీపీకి హేమా హేమీలైన నాయకులు ఉండేవారు. కానీ జగన్ చేజేతులా వారిని దూరం చేసుకున్నారు. కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు వంటి సీనియర్లు సేవలందించేందుకు సిద్ధంగా ఉండేవారు. కానీ వారిని వినియోగించుకోలేకపోయారు. గతంలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా వరుదు కళ్యాణిని ఎంపిక చేశారు.ఆమె సైతం శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేత.ఇప్పుడు అదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పొరుగు జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ ను ఎంపిక చేశారు. దీంతో స్థానిక నేతల్లో అసంతృప్తి ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
* కోలా గురువులకు నిరాశ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎలాగైనా కైవసం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ముందుగానే బొత్సను అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల సన్నాహాలు చేసుకోవాలని సూచించారు. అయితే అదే జిల్లాకు చెందిన కోలా గురువులు ఎమ్మెల్సీ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అప్పట్లో ఆయనకు డిసిసిబి పదవి ఇచ్చి సరిపెట్టారు. ఇప్పుడు చేతిలో ఏ పదవి లేదు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని భావించారు. కానీ ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థి కావడం, స్థానిక సంస్థల ప్రతినిధులను శిబిరం ఏర్పాటు చేసి తరలిస్తారని భావించడంతోనే.. బొత్సకు జగన్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అది అంతిమంగా వైసీపీలో అసంతృప్తికి కారణమవుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు అధికార కూటమి గాలం వేస్తే.. వెళ్లిపోయేలా వైసిపి నేతలు ఉండడం విస్తుగొల్పుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More