Rebellion in YCP: సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీకి ఓటమి ఎదురైతే గుణపాఠాలు నేర్చుకుంటుంది. తనలో కొన్ని రకాల మార్పులు తెచ్చుకుంటుంది. కానీ ఎందుకో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఆ పార్టీ నాయకత్వంలో మార్పు కంటే.. పార్టీలో నేతల మార్పున కే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. అలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. ఒక నేతను అధికారుల మాదిరిగా బదిలీ చేస్తున్నట్టు వేరే జిల్లాల్లో పోటీ చేయించడం అనేది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే చూసాం. ఎంతకాలం ఈ మార్పులతో అని సొంత పార్టీ నేతలు అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బదిలీ చేస్తే ఊరుకున్నాం కానీ.. ఇప్పుడు అపోజిషన్ లో ఉండగా బదిలీ చేయడం ఏమిటని.. సొంత జిల్లా, సొంత ప్రాంతం వదులుకొని వేరే చోట రాజకీయం చేయడం ఏమిటనేది నేతల వాదన. ఒక ప్రయోగం వికటించింది. మళ్లీ అటువంటి ప్రయోగాన్ని అనుసరించడం ఎంతవరకు కరెక్ట్ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలదీసినంత పని చేస్తున్నారు.
ఆది నుంచి కొత్త వారితో…
2014 ఎన్నికల్లో కొత్తవారితో ప్రయోగం చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. రాయలసీమలో కొత్త వారితో పాటు సీనియర్లు గెలవగలిగారు. కోస్తాలో సైతం కొంత ఫలితం ఇచ్చింది. గోదావరి తో పాటు ఉత్తరాంధ్రలో అరకొర స్థానాలను అలా కైవసం చేసుకున్నారు. 2019 విషయానికి వచ్చేసరికి కొత్త వారికి ఎక్కువగా చాన్స్ ఇచ్చారు. దాదాపు అందరూ గెలిచేశారు. అయితే అప్పటివరకు తన ముఖం చూసి వేశారని భావించారు జగన్మోహన్ రెడ్డి. మరి అదే ధీ మా 2024 ఎన్నికల్లో ఉండాలి కదా. తన పాలన రెఫరెండం అనుకోవచ్చు కదా. కానీ అలా అనుకోలేదు. తాను గుడ్.. మీరు బ్యాడ్ అన్నట్టు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేశారు. 80 చోట్ల మార్పులు చేశారు. కానీ ఆ ప్రయోగం దారుణంగా విఫలమయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది.
ఇప్పుడు కూడా అదే ప్రయోగం..
ఇప్పుడు కూడా అదే ప్రయోగం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ అదే ధోరణితో ముందుకు వెళుతున్నారు. ఎక్కడో చిలకలూరిపేట లో ఉన్న విడదల రజిని తీసుకొచ్చి రేపల్లెలో పోటీ చేయమంటున్నారు. ఎక్కడో నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ ను తెచ్చి గుంటూరులో పోటీ చేయమంటున్నారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గాల ప్రయోగం అలానే చేస్తున్నారు. గత ఎన్నికల్లో మార్చిన 80 మంది అభ్యర్థులను సొంత ప్రాంతాలకు పంపించడం లేదు. తెలియని ఊరిలో రాజకీయం చేయమంటే ఎలా అని ఆవేదనతో ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఉన్న ఊరిలోనే రాజకీయం చేస్తామంటే కుదరని రోజులు ఇవి. ఎక్కడికో వెళ్లి రాజకీయాలు చెయ్యమనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందులను కాదని ఉత్తరాంధ్రకు వచ్చి పోటీ చేయగలరా? అంతెందుకు పులివెందులను విడిచిపెట్టి కడప జిల్లా కేంద్రానికి రాగలరా? ఇలా ఎన్నెన్నో నిలదీసినంత ప్రశ్నలు వైసిపి నుంచి వస్తున్నాయి. మళ్లీ చేర్పులు మార్పులు అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే అసహనం పెరగడం ఖాయం. ఇక తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే.