RDO vs DRO in Visakhapatnam: విశాఖలో( Visakhapatnam) ఇద్దరు రెవెన్యూ అధికారుల బదిలీ వెనుక కారణం ఏంటి? ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి ఎందుకు దిగింది? తప్పు ఎవరిది? ఇద్దరిదా? ఒక్కరిదా? ఒకరు తప్పు చేస్తే ఇద్దరిపై చర్యలు తీసుకున్నారా? అసలు జరిగిందేంటి? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల కిందట విశాఖ ఆర్డీవో శ్రీలేఖ, జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్ల పై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. ఇద్దరినీ సాధారణ పరిపాలన శాఖకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. ప్రస్తుతం విశాఖ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నవేళ ఇద్దరు అధికారులు బహిరంగంగా ఆరోపణలు తీసుకుని వీధికి ఎక్కడం ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం పై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఇలా బదిలీ వేటు వేసినట్లు సమాచారం.
ఆర్డీవో కు ట్రాక్ రికార్డు..
ఆర్డీవో శ్రీలేఖకు ( Sreelekha )మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఆమె ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఆర్డిఓ గా ఉండేవారు. ఓ ఇష్యూలో ఆమె వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా నిలిచారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఆమెను ఇబ్బంది పెట్టినట్లు ప్రచారం నడిచింది. అటువంటి ఆమె టిడిపి ప్రభుత్వంలో సైతం ఇబ్బంది పడడాన్ని అధికార పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. డిఆర్ఓ భవానీ శంకర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషి అని.. అటువంటి అధికారి కోసం ఆర్డీవో శ్రీలేఖను బలి పశువు చేశారంటూ టిడిపి నేతలు బాహటంగానే ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఆర్డీవో వర్సెస్ డిఆర్ఓ అన్నట్టు పరిస్థితి ఉండేది. తన రెవెన్యూ డివిజన్ పరిధిలో తహసిల్దార్లతోపాటు అధికారుల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారు అంటూ డిఆర్ఓ పై ఆర్డీవో శ్రీలేఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏకంగా లేఖ రాశారు. అది మొదలు రచ్చ ప్రారంభం అయింది. ఆర్డీవో శ్రీలేఖ ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్తున్నారని డిఆర్ఓ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఇద్దరిపై బదిలీ వేటు వేసింది. సాధారణ పరిపాలన విభాగానికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
భూముల వ్యవహారమే కారణమా?
అయితే విశాఖలో ఓ భూముల వ్యవహారమే ఆర్డీవో శ్రీలేఖ పై బదిలీ వేటుకు కారణమన్న ప్రచారం నడుస్తోంది. ఉత్తరాంధ్రకు( North Andhra) చెందిన రవిచంద్ర అనే సీనియర్ ఐఏఎస్ అధికారి సీఎంవో లో పనిచేస్తున్నారు. ఓ 60 ఎకరాల భూములకు సంబంధించి ఫేవర్ చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. అందుకు ఆర్డిఓ శ్రీలేఖ అడ్డు తగలడంతోనే ఆమెపై బదిలీ వేటు వేసినట్లు ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సైతం రవిచంద్ర కీలక అధికారిగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా సీఎం ఓలో కీలక పోస్టులో ఉన్నారు. ఆయనది వెలమ సామాజిక వర్గం. కింజరాపు కుటుంబానికి కావలసిన మనిషిగా పేరు ఉంది. అయితే విశాఖలో ఆర్డీవో వర్సెస్ డిఆర్ఓ అన్న పరిస్థితి వెనుక ఐఏఎస్ అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ ఆ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.
వైసీపీ నేతలతో సన్నిహితంగా..
మరోవైపు డిఆర్ఓ భవాని శంకర్ ( DRO Bhavani Shankar )వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అత్యంత సన్నిహిత అధికారిగా ప్రచారం ఉంది. గతంలో ఆయన విజయనగరం ఆర్డీవో గా పని చేశారు. ఆ సమయంలోనే అప్పటి కీలక అధికారి జవహర్ రెడ్డి భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో భవాని శంకర్ ఆర్డీవో గా ఉన్నారు. అటువంటి అధికారిని తీసుకొచ్చి ఇప్పుడు విశాఖ ఆర్డీవో గా నియమించారు. ఈ నియామకం వెనుక సీఎంఓ కీలక అధికారి హస్తము ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇద్దరి అధికారుల్లో ఒకరు తప్పు చేస్తే ఇద్దరిని బదిలీ చేయడం ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే విశాఖకు దిగ్గజ పరిశ్రమలు వస్తున్న దృష్ట్యా.. వాటికి భూ సమీకరణ చేయాల్సింది రెవెన్యూ శాఖ. ఇటువంటి సమయంలో బహిరంగంగా ఇద్దరు అధికారులు గొడవకు దిగుతుండడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అందుకే సాధారణ పరిపాలన శాఖకు పంపించి.. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో? ఎవరిది తప్పు? అన్నది తెలియాల్సి ఉంది.