100 crore donation to Amaravati: ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) అన్నీ శుభశకునాలే. ఒకవైపు విశాఖకు ఐటి దిగ్గజ సంస్థలు వస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు ఒప్పందం కూడా కుదిరింది. ఇది మిగతా రాష్ట్రాల్లో కూడా చర్చకు దారితీస్తోంది. ఇంకోవైపు అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఒకవైపు విశాఖకు ఐటి పరిశ్రమలు.. ఇంకోవైపు అమరావతికి విదేశీ పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటనలో ఉండగా అక్కడి పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా శోభ గ్రూప్ చైర్మన్ పిఎన్సి మీనన్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతిలో అధునాతన లైబ్రరీ ఏర్పాటు కోసం 100 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది శోభ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇది నిజంగా అమరావతికి శుభవార్త.
ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా..
ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని( Amaravati capital ) నిర్మించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. నవ నగరాలను నిర్మించి ప్రపంచ పటంలో అమరావతికి చోటు కల్పించాలన్నది చంద్రబాబు లక్ష్యం. అందుకే అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రపంచం గుర్తించేలా నిర్మాణాలు చేపడుతున్నారు. అందులో భాగంగా వరల్డ్ క్లాసు లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అదే విషయాన్ని తన దుబాయ్ పర్యటనలో శోభ గ్రూప్ చైర్మన్కు చెప్పడంతో ఆయన అంగీకరించారు. 100 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. చంద్రబాబు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పి4 కార్యక్రమం గురించి కూడా ఆయనకు వివరించారు సీఎం చంద్రబాబు.
ఏకంగా రూ.150 కోట్లతో..
అమరావతిలో 150 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రంథాలయం( library) ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లైబ్రరీ నిర్మాణం ప్రారంభించిన 24 నెలల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీల ఏర్పాటుకు నిర్ణయించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన మోడల్ లైబ్రరీల నిర్మాణం ఉండనుంది. పెద్ద ఎత్తున దాతల సహకారంతో లైబ్రరీల ఏర్పాటుకు నిర్ణయించింది. విశాఖలో 20 కోట్ల రూపాయలతో మోడల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటుంది. అయితే అమరావతిలో మోడల్ లైబ్రరీ నిర్మాణానికి ఒక అంతర్జాతీయ సంస్థ రూ.100 కోట్లు విరాళంగా ప్రకటించడం మాత్రం ఒక రికార్డ్.