AP Elections 2024: పిఠాపురంలో పవన్ ను ఓడించాలన్న ప్రయత్నంలో వైసిపి ఉంది. ఒకవైపు రాజకీయంగా ఎదుర్కొంటూనే.. మరోవైపు వ్యవస్థల పరంగా మేనేజ్ చేస్తోంది. ఇంకోవైపు రాయలసీమ నుంచి మనుషులను దింపుతోంది. గత ఎన్నికల్లోనూ పవన్ ను ఓడించేందుకు రాయలసీమ బ్యాచ్ రంగంలోకి దిగిన సంగతి తెలిసింది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఎవరెవరో పిఠాపురంలో ఎంటర్ అవుతున్నారు. మునుపెన్నడూ చూడని కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి అన్ని రకాల మాఫియాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వైసిపి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతోంది. నకిలీ మద్యం ముంచెత్తుతోంది. బయటనుంచి ఎర్రచందనం స్మగ్లర్లు, రౌడీ షీటర్లు పెద్ద ఎత్తున పిఠాపురం వస్తున్నారు. నియోజకవర్గాన్ని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిని చూస్తున్న పిఠాపురం ప్రజలు హడలెత్తిపోతున్నారు.
రాయలసీమలోని కుప్పం, హిందూపురంలో వైసిపి ఇదే మాదిరిగా వ్యవహరిస్తోంది. ఆ రెండు నియోజకవర్గాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆధీనంలోకి తెచ్చుకొని.. ఎన్నికలను ప్రభావితం చేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పిఠాపురంలో సైతం పిల్ల పెద్దిరెడ్డి రంగంలోకి దిగినట్లు సమాచారం. అయితే ఇక్కడ వంగా గీత కేవలం అభ్యర్థి మాత్రమే. ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు రాజకీయమంతా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి నేతృత్వంలోని ఓ 40 మంది స్మగ్లర్లు చూస్తున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఒక్క ఎర్రచందనం స్మగ్లర్లే కాదు అన్ని రకాల అరాచక శక్తులు పిఠాపురంలో అడుగుపెట్టాయి. అందుకే మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యేకంగా స్పందించారు. ఎన్ని అరాచక శక్తులను తెచ్చుకుంటారో తెచ్చుకోండి అంటూ సవాల్ చేశారు.
పిఠాపురంలో డబ్బులతో ప్రజాభిప్రాయాన్ని మార్చాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. వందల కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. నియోజకవర్గంలో ప్రతి వైసిపి నేతకు రెండు నుంచి ఐదు లక్షల రూపాయలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇక మద్యం గురించి చెప్పనవసరం లేదు. పిఠాపురం మొత్తాన్ని స్మగ్లింగ్ మద్యంతో నింపేశారు. ఓటర్లకు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. కనీసం 50 చోట్ల మద్యం డంపులు పెట్టి. ప్రచారంలో పాల్గొన్న వారికి పంపిణీ చేస్తున్నారు. అయితే అదంతా నాన్ పెయిడ్ గోవా మద్యంగా తెలుస్తోంది. ఒకవైపు నోట్ల కట్టలు, మరోవైపు మద్యం, ఇంకోవైపు రాయలసీమ సంస్కృతి కనిపిస్తుండడంతో పిఠాపురం ప్రజలు భయపడుతున్నారు. ఎన్నికల్లోనే రాయలసీమ కల్చర్ చూపిస్తుంటే.. గెలిస్తే ఏ పరిస్థితి ఉంటుందో అనుమానిస్తున్నారు. అందుకే వైసీపీ తీరును తప్పుపడుతున్నారు. అయితే ఈ తరహా ప్రయోగాలు వైసిపికి నష్టమే తప్ప.. లాభం ఉండదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.