https://oktelugu.com/

AP BJP: ఆ సీనియర్ ఎమ్మెల్యే పై రాయలసీమ బిజెపి నేతల ఫిర్యాదు!

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు రాయలసీమ జిల్లాల నేతలు బిజెపి హై కమాండ్ కు లేఖ రాశారు. ఆ సీనియర్ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.

Written By: , Updated On : March 6, 2025 / 04:26 PM IST
AP BJP

AP BJP

Follow us on

AP BJP: ఏపీ బీజేపీలో( AP BJP) విభేదాల పర్వం నడుస్తోంది. ఎక్కడికక్కడే నేతల మధ్య గ్యాప్ ఉంది. అది మరింత పెరిగి అగాధంగా మారుతోంది. ముఖ్యంగా రాయలసీమలో ఆ పరిస్థితి కనిపిస్తోంది. గత ఐదేళ్లలో బిజెపికి కనీస ప్రాతినిధ్యం లేదు. కానీ ఈసారి పొత్తులో భాగంగా ఏపీలో ఆ పార్టీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుంది. అయితే టిడిపి తో పాటు జనసేన బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. బిజెపిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. పైగా నేతల మధ్య విభేదాలు పర్వం నడుస్తోంది.

 

Also Read:  ఇక దువ్వాడ వంతు.. రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు.. అరెస్టు తప్పదా?

* ఆ రెండు జిల్లాల నేతల ఫిర్యాదు
పొత్తులో భాగంగా కడప జిల్లాలో( Kadapa district ) కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గ నుంచి గెలిచారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. అయితే ఆయనపై సొంత పార్టీ నేతలే ఇప్పుడు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ జిల్లాలకు చెందిన ఏడుగురు కీలక నాయకులు హై కమాండ్ కు లేఖ సమర్పించినట్లుగా వెలుగులోకి వచ్చింది. సొంత పార్టీ క్యాడర్ను పట్టించుకోకుండా.. వ్యాపారాలు చేసుకుంటూ.. పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తున్నారని సదరు నేతలు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర బిజెపిలో హాట్ టాపిక్ అవుతోంది. టిడిపి నేతగా ఉన్న ఆదినారాయణ రెడ్డి బిజెపిలో చేరారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్న ఆ మధ్యన జెసి ప్రభాకర్ రెడ్డితో వివాదం పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం వరకు ఆ వివాదం నడిచింది.

* ఆ లేఖ వెనుక ఎంపీ
అయితే తాజాగా బిజెపి ఎంపీ సీఎం రమేష్ తో( MP CM Ramesh ) ఆదినారాయణ రెడ్డికి విభేదాలు ఏర్పడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డి సొంత వ్యాపారాలకు పెద్దపీట వేస్తున్నారు అంటూ ఉమ్మడి కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ఏడుగురు బిజెపి నాయకులు ఆదినారాయణ రెడ్డికి వ్యతిరేకంగా హై కమాండ్ కు లేఖ సంధించినట్లు తెలిసింది. దీనిలో ఆది చేస్తున్న అక్రమాలు, ఆయన సంపాదించిన ఆస్తుల గురించి వివరించినట్లు సమాచారం. అయితే ఈ లేఖ వెనుక సీఎం రమేష్ హస్తం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఏకంగా ఆదినారాయణ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఈ లేఖలో కోరడం సంచలనం గా మారింది. మున్ముందు బిజెపిలో వ్యవహారాలు ఏ స్థాయికి చేరతాయో చూడాలి.

 

Also Read:  నాగబాబు, పిఠాపురం వర్మ ఓకే.. మిగతా ఆ నలుగురు ఎవరు?