Ravi Prakash: రవిప్రకాష్ జోస్యాలు : ఎన్నికల వేళ ఎంత వరకు కరెక్ట్

కాకపోతే రవి ప్రకాష్ చెప్పినట్టుగా ఫలితాలు ఉంటాయా అనేది కొంచెం డౌటే. ఎందుకంటే ఏపీలో రాజకీయాలు అంత సులభంగా అంతు పట్టవు. గత ఎన్నికల్లో చాలామంది వైసిపి అధికారంలోకి వస్తుందని చెప్పారు గానీ.. వన్ సైడ్ విక్టరీ అని మాత్రం చెప్పలేకపోయారు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 3, 2024 3:42 pm

Ravi Prakash

Follow us on

Ravi Prakash: చాలాకాలం తర్వాత సుప్రసిద్ధ జర్నలిస్ట్ రవి ప్రకాష్ తెరపైకి వచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్ ఆర్ టీవీ ద్వారా గేమ్ చేంజర్ పేరుతో ఎన్నికల ఫలితాలను బయటపెట్టాడు. తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుందని చెప్పిన రవి ప్రకాష్.. ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించాడు. ఇక్కడ రవి ప్రకాష్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా వరకు మీడియా సంస్థలు ఎన్నికల్లో గెలుపు, ఓటములను అంత స్పష్టంగా చెప్పలేవు. రాజకీయ పార్టీలకు బాకాలు ఊదే చానల్స్ కూడా అలాంటి ధైర్యాన్ని చేయలేవు. కానీ, రవి ప్రకాష్ లో మొండితనం ఎక్కువ కాబట్టి.. ఆ పని చేశాడు. సరే ఇందులో క్రెడిబుల్టీ ఎంత, ఏ ప్రాతిపదికన ఆ సర్వే చేశారు, ఎంతమంది శాంపిల్స్ తీసుకున్నారు, ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనే విషయాలపై చర్చకు పోవడం లేదు కానీ.. రవి ప్రకాష్ చెప్పిన కొన్ని పాయింట్స్ మాత్రం ఇంట్రెస్ట్ గా ఉన్నాయి.. ఇందులో కొన్ని ప్రాంతాలలో వైసిపి గత ఎన్నికల్లో ప్రదర్శించిన మ్యాజిక్ ను కోల్పోయిందనేది వాస్తవం. పంచుడు పథకాలకే డబ్బులు ఖర్చు పెట్టడం, అభివృద్ధిని విస్మరించడంతో ఈ పరిస్థితి దాపురించిందనేది కూడా నిజమే. ఇదే విషయాన్ని రవి ప్రకాష్ సూటిగా చెప్పాడు. అతడి జర్నలిజంలో ఉన్న బ్యూటీ కూడా అదే.

కాకపోతే రవి ప్రకాష్ చెప్పినట్టుగా ఫలితాలు ఉంటాయా అనేది కొంచెం డౌటే. ఎందుకంటే ఏపీలో రాజకీయాలు అంత సులభంగా అంతు పట్టవు. గత ఎన్నికల్లో చాలామంది వైసిపి అధికారంలోకి వస్తుందని చెప్పారు గానీ.. వన్ సైడ్ విక్టరీ అని మాత్రం చెప్పలేకపోయారు. ఇప్పుడు రవి ప్రకాష్ కూడా టిడిపి కూటమిదే అధికారమని చెబుతున్నారు గాని.. జగన్ అంత సులువుగా అధికారాన్ని వదిలిపెట్టడు. రవి ప్రకాష్ సర్వేలో వైసీపీకి ఢీ అంటే ఢీ అనే స్థాయిలో సీట్లు వస్తున్నాయంటే మామూలు విషయం కాదు. ఫీల్డ్ లెవల్ లో సర్వే చేసిన రవి ప్రకాష్ టీం.. కొన్ని ప్రాంతాలలో వైసీపీ ఎందుకు గెలుస్తుందో మాత్రం చెప్పలేకపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. వైసిపి ఎమ్మెల్యేలు ఎందుకు గెలుస్తున్నారనే విషయాన్ని సోదాహరణంగా వివరించలేకపోయింది.

ఇక ఈ ఫలితాలను వెల్లడించే కంటే ముందు జర్నలిజాన్ని బతికించేందుకు తాను ముందుకు వచ్చానని రవి ప్రకాష్ చెప్పారు. ప్రధాన పార్టీలకు జర్నలిజం బాకాలు ఊదుతోందని బాధపడ్డారు. కానీ ఇక్కడే రవి ప్రకాష్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. సుప్రభాతం మ్యాగ్జిన్ లో పనిచేసినప్పుడు రవి ప్రకాష్ ఆస్తులు ఎంత? తేజ టీవీలో పనిచేస్తున్నప్పుడు ఆయన సంపాదన ఎంత? టీవీ9 మొదలుపెట్టినప్పుడు ఆయన జీతం ఎంత? అందులో నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఇప్పటికీ కోర్టు కేసులు ఎందుకు ఎదుర్కొంటున్నారు? రఘు అనే జర్నలిస్టు తో గొడవ ఎందుకు? తొలివెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ఒక్కసారిగా స్వరం ఎందుకు మార్చుకుంది? ఆర్ టీవీ ఎన్నికల్లో టిడిపి కూటమికి ఎందుకు సపోర్ట్ చేస్తోంది? ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత రవి ప్రకాష్.. మీడియాకు సుద్ధులు చెబితే బాగుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఎన్నికల ముందు ఒక బాధ్యతాయుతమైన న్యూస్ ఛానల్ ఎటువంటి ఫలితాలను వెల్లడించకూడదు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్నికల సంఘం నిబంధనల అనుకూలంగానే వెల్లడిస్తారు. కానీ, కొత్త జీతగాడు పొద్దెరగడు అనే సామెత తీరుగా రవి ప్రకాష్ ఎన్నికల ఫలితాలను వెల్లడించడం విశేషం.. నీతులు, సుభాషితాల గురించి పదేపదే చెప్తున్న రవి ప్రకాష్.. మరి ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాడు.. మీడియా ఎప్పుడో అమ్ముడుపోయింది. అమ్ముడు పోతూనే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో దానికి డిమాండ్ ఉంటుంది కాబట్టి. గతంలో రవి ప్రకాష్ కూడా మీడియాను అమ్మినవాడే. ఇకపోతే ఆయన అమ్ముడుపోయిన విధానం చాలా ఖరీదు. ఇప్పుడేదో ఇతడు తెర పైకి వచ్చి.. జర్నలిజాన్ని ఉద్ధరిస్తామని చెబితే.. అంత పిచ్చిగా నమ్మే వారు ఎవరూ లేరు. ఇదే సమయంలో రవి ప్రకాష్ ప్రకటించిన ఎన్నికల ఫలితాలను కూడా సీరియస్ గా తీసుకునేవారు లేరు. ఎవరి బృందాలు వారికున్న తర్వాత.. ఎవరి నెట్వర్క్ వారికి ఉన్న తర్వాత.. రవి ప్రకాష్ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న గేమ్ చేంజర్.. పెద్దగా జనాలకు ఎక్కదు. ఎందుకంటే ఇవి టీవీ9 లాంచింగ్ రోజులు కావు కాబట్టి..