ఏపీలో( Andhra Pradesh) కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 7 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కొత్త రేషన్ కార్డులతో పాటు చేర్పులు మార్పులకు సైతం ఈసారి అవకాశం కల్పించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఏపీలో రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. దీంతో లబ్ధిదారులు సైతం ఎంతో ఆశతో దరఖాస్తులు చేసుకుంటున్నారు. సచివాలయాలతో పాటు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డుల దరఖాస్తులు పెట్టుకోవచ్చు. మరోవైపు రేషన్ కార్డుకు చేసుకున్న దరఖాస్తు స్టేటస్ సైతం తెలుసుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం రేషన్ కార్డు దరఖాస్తు ఏ అధికారి వద్ద ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.
Also Read : సరస్వతి పుష్కరాలు :కాళేశ్వరంకు వెళ్లే దారులు ఇవీ
* దరఖాస్తుల వెల్లువ..
రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల( ration cards ) కోసం లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. కుటుంబాల నుంచి విడిపోయిన వారు.. కొత్తగా పెళ్లయిన వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అలాగే మొత్తం రేషన్ కార్డులకు సంబంధించి ఏడు సర్వీసుల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. చనిపోయిన వారి పేర్లు తొలగింపు, కొత్త పేర్లు జత చేయడం, ఆధార్ సీడింగ్.. ఇలా అన్ని కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మన అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.సచివాలయాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదు పొందవచ్చు. దరఖాస్తుదారుడు మొబైల్ కు ఏపీ ప్రభుత్వం నుంచి మెసేజ్ వస్తుంది. ఇందులో అప్లికేషన్ నెంబర్, ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ ద్వారా రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత.. ఈకేవైసీ, వీఆర్వో, తహసిల్దార్ లెవెల్స్ లో పరిశీలన చేస్తారు. ఈ మూడు దశలు పూర్తయ్యేందుకు మొత్తం 21 రోజుల సమయం పడుతుంది.
* చెక్ చేసుకోవడం ఇలా
ఏపీ సేవ పోర్టల్( apsava portal ) అధికార వెబ్ సైట్ https/ vswsonline.ap.gov. in/ ను ముందుగా విజిట్ చేయాలి. హోం పేజీలో ‘service request status check’ అనే సెర్చ్ లింకు కనిపిస్తుంది. ఈ సెర్చ్ లింకులో రేషన్ కార్డు దరఖాస్తు సమయంలో ఇచ్చిన నెంబర్ను ఎంటర్ చేయాలి. క్యాప్చ కోడ్ ను నమోదు చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి. రేషన్ కార్డు ఏ స్టేజిలో ఉందో.. ఎవరి వద్ద పెండింగ్లో ఉందో.. స్టేటస్ చూపిస్తుంది. మీ కార్డు సర్వీస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో తెలియజేస్తారు కూడా. ఇలా మన కార్డు దరఖాస్తు ఏ పొజిషన్లో ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు.