Rammohan Naidu: టిడిపి యువ నేత, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మరో ప్రతిష్టాత్మక పదవి వరించింది. అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు లభించింది. మోడీ క్యాబినెట్లో యంగ్ డైనమిక్ మినిస్టర్ గా గుర్తింపు పొందారు ఆయన. 36 సంవత్సరాలకే ఏకంగా కేంద్ర క్యాబినెట్ హోదా దక్కించుకున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.ఇప్పుడు ఆసియా పసిఫిక్- మినిస్ట్రీయల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న ఆ విభాగం అంతర్జాతీయ సమావేశంలో ఆయనను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆసియన్ పసిఫిక్ మినిస్ట్రీ రియల్ కాన్ఫరెన్స్ లో 40 దేశాలకు ప్రాతినిధ్యం ఉంది.ఆ సభ్యులు ఏకగ్రీవంగా రామ్మోహన్ నాయుడును అధ్యక్షడిగా ఎన్నుకున్నారు. ఇది దేశానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు రామ్మోహన్ నాయుడు.26 సంవత్సరాలకే ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు.మంచి వాగ్దాటితో పాటు నడవడికతో అందరినీ ఆకట్టుకున్నారు.అదే అనతి కాలంలో ఆయనకు గుర్తింపు లభించేలా చేసింది. ఏకంగా కేంద్ర క్యాబినెట్లో విమాన యాన శాఖను దక్కించుకునేలా చేసింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రామ్మోహన్ నాయుడుకు పదవి లభించింది. దీంతో శ్రీకాకుళం జిల్లా పులకించుకుపోతోంది. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* ఎర్రం నాయుడుది చెరగని ముద్ర
ఏపీ రాజకీయాల్లో కింజరాపు కుటుంబానిది ప్రత్యేక స్థానం. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు దివంగత కింజరాపు ఎర్రం నాయుడు. 1985లో తొలిసారిగా హరిశ్చంద్ర పురం అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఎర్రం నాయుడు. 1996లో తొలిసారిగా శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 1999లో కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. 2004 వరకు శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని పదిల పరుచుకున్నారు. 2009లో మాత్రం ఓడిపోయారు. 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.
* తండ్రి అకాల మరణంతో
ఎర్రం నాయుడు అకాల మరణంతో ఆయన వారసుడిగా రామ్మోహన్ నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు.2014లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.2019లో జగన్ ప్రభంజనంలో సైతం తట్టుకుని నిలబడ్డారు. శ్రీకాకుళం ఎంపీగా రెండోసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడోసారి గెలిచి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. 36 సంవత్సరాలకే కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకొని పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మంచి వాగ్దాటి కలిగిన నేతగా గుర్తింపు పొందిన రామ్మోహన్ నాయుడు 2021లో సంసద్ రత్న అవార్డును సొంతం చేసుకున్నారు.
* చంద్రబాబుకు ఆత్మీయుడిగా
తండ్రి ఎర్రం నాయుడు మాదిరిగా చంద్రబాబుకు అత్యంత ఆత్మీయుడుగా మారారు.జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అక్రమ కేసుల్లో అరెస్టయిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో ఢిల్లీ వేదికగా లోకేష్ తో రామ్మోహన్ నాయుడు క్రియాశీలకంగా వ్యవహరించారు.కేంద్ర పెద్దలతో మాట్లాడి చంద్రబాబు బెయిల్ విషయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకే చంద్రబాబు కింజరాపు కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్ర క్యాబినెట్లో ఎర్రం నాయుడు సోదరుడు అచ్చెనాయుడుకు ఛాన్స్ ఇచ్చారు.మరోవైపు రామ్మోహన్ నాయుడుకు కేంద్రం మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు.చంద్రబాబు ఆశలను వమ్ము చేయకుండా గట్టిగానే కృషి చేస్తూ వచ్చారు రామ్మోహన్ నాయుడు.ఇప్పుడు ఏకంగా ఓ అంతర్జాతీయ కాన్ఫరెన్స్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు యువ నేత.దీంతో టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.