Minister Rammohan Naidu: అధికారంలో ఉంటే ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే రివర్స్ అవుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి ( Mithun Reddy)అటువంటి పరిస్థితి ఎదురయింది. ఈరోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడారు. తన సొంత నియోజకవర్గంలో తనకు ఎదురైన పరిణామాలను వివరించారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని.. ప్రత్యర్థులపై కేసులు, అరెస్టులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కేంద్రమంత్రికి కింజరాపు రామ్మోహన్ నాయుడు ధీటైన సమాధానం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వైఖరి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే రామ్మోహన్ నాయుడు ఒక్కసారిగా విరుచుకు పడుతుంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సైలెంట్ కావాల్సి వచ్చింది. అయితే ఇదే మిథున్ రెడ్డి ఓ ఐదేళ్ల కిందట రామ్మోహన్ నాయుడు విషయంలో వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చకు వస్తోంది. నిండు సభలో సాటి తెలుగు ఎంపీ అని చూడకుండా.. కూర్చోరా భాయ్ నువ్వు మాట్లాడింది చాలు అంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడారు. సీన్ కట్ చేస్తే సరిగ్గా ఐదేళ్ల తర్వాత చిన్న వయసులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండగా… అప్పటికి ఇప్పటికీ అదే ఎంపి స్థానంలో ఉన్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.
అప్పట్లో అధికార మదంతో..
2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఘనవిజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆ పార్టీ జైత్రయాత్ర కొనసాగింది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను 22 చోట్ల గెలిచింది ఆ పార్టీ. తెలుగుదేశం పార్టీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని మాత్రమే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. అయితే సభలో ముగ్గురు టిడిపి ఎంపీలు ఉన్న గట్టిగానే వాయిస్ వినిపించేవారు. ముఖ్యంగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక వాగ్దాటితో పార్లమెంటులో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు అధికారపక్షం తో పాటు విపక్షాలు సైతం ఆసక్తిగా గమనించేవి. చివరకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆశ్చర్యంగా చూసేవారు. ఒక విధంగా చెప్పాలంటే రామ్మోహన్ నాయుడు పనితీరును గుర్తించి చిన్న వయసులోనే పౌర విమానయాన లాంటి పెద్ద శాఖను అప్పగించారు. ఒక విధంగా చెప్పాలంటే రామ్మోహన్ నాయుడు గుర్తింపు వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రచ్చగొట్టే ధోరణి ఉంది. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలను ఐదేళ్ల కాలంలో బాగానే ఎండగట్టారు రామ్మోహన్ నాయుడు.
గుక్క తిప్పుకోకుండా సమాధానం..
అయితే రామ్మోహన్ నాయుడు( Ram Mohan Naidu ) మూడుసార్లు ఎంపీగా గెలిచారు. అదే సమయంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సైతం రాజంపేట నుంచి వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే రామ్మోహన్ నాయుడుకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయనను ఓడించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్నారు. ఈరోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే ఏపీలో అరాచకాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పగా.. సభలో ఉన్న పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గట్టిగానే బదులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, వివాదాలు, కేసులు, పాలన, ప్రత్యర్థులను వెంటాడిన తీరు, ఏపీ ఏ విధంగా నష్టపోయింది అనే అంశాలను గుక్క తిప్పుకోకుండా చెప్పగలిగారు రామ్మోహన్ నాయుడు. దీంతో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మౌనంగా ఉండి పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రామ్మోహన్ నాయుడు విషయంలో గతంలో వ్యవహరించిన వీడియోను ఎక్కువ మంది వైరల్ చేస్తున్నారు. నాటి మిథున్ రెడ్డి ప్రవర్తనకు ఇప్పుడు దీటైన సమాధానం చెప్పారంటూ రామ్మోహన్ నాయుడుకు అభినందనలు వెలువెత్తుతున్నాయి.