Ramdev Baba : ఏపీ సమగ్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు సీఎం చంద్రబాబు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అన్ని రంగాలను సమపాళ్లలో అభివృద్ధి చేయనున్నారు. క్రీడల పరంగా అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా గోల్ఫ్ ప్రాంగణాలను అందుబాటులోకి తేనున్నారు. అందుకు సంబంధించి ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తో కీలక చర్చలు జరిపారు చంద్రబాబు. ఆయన సేవలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబుతో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సమావేశం అయ్యారు. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాలపైనే ఎక్కువగా దృష్టి పెడతారు రాందేవ్ బాబా. 2016 తర్వాత మాత్రం ఏపీ పై ఫోకస్ పెట్టారు. ఆ కాలంలో అమరావతిలో యోగా శిబిరాలు కూడా నిర్వహించారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా యోగా దినోత్సవం కూడా నిర్వహించారు. ఏకంగా చంద్రబాబుతో యోగాసనాలు కూడా వేయించారు. అమరావతిలో యోగా కేంద్రం ఏర్పాటుకు సంబంధించి సన్నాహాలు కూడా అప్పట్లో జరిగాయి. కానీ ఆ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. ఇంతలో ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ అధికారంలోకి రావడంతో అటువంటి ప్రయత్నాలు నీరుగారిపోయాయి.
* చంద్రబాబుతో చర్చలు
తాజాగా కూటమి అధికారంలోకి రావడంతో రామ్ దేవ్ బాబా ఏపీపై మరోసారి దృష్టి పెట్టారు. సీఎం చంద్రబాబును కలిసి గత ప్రతిపాదనలను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. సుమారు గంట పాటు చంద్రబాబుతో భేటీ అయ్యారు బాబా. తొలుత చంద్రబాబుకు రాందేవ్ బాబా బంగారంతో కూడిన తులసి మాలను బహుకరించారు. చంద్రబాబు బాబాకు శాలువ కప్పి అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్ ను అందించారు.
* సరికొత్త ప్రతిపాదనలతో
అయితే తాజాగా రామ్ దేవ్ బాబా ప్రతిపాదనలతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు సమాచారం. ప్రధానంగా వ్యవసాయం, పంట తోటలు, ఉద్యాన తోటలకు సంబంధించి పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. అలాగే అమరావతిని ప్రపంచ యోగా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బాబా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన వెల్నెస్ కేంద్రాల్లో ఆయుర్వేద వైద్యం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు బాబా. బాబా విన్నపాలను చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించడం విశేషం.