Ramanaidu Studios: విశాఖలో రామానాయుడు స్టూడియో( ramanaidu studio ) భూముల విషయంలో యాజమాన్యానికి షాక్ తగిలింది. ప్రముఖ సినీ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ కు ఈరోజు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. విశాఖలో రామానాయుడు స్టూడియోస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని.. వాటిలో కొంత భాగం ఇతర అవసరాలకు వాడుకున్న వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో వివాదం నడుస్తోంది. అయితే ఈ విషయంలో కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందాలని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ భావించారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో రామానాయుడు స్టూడియోస్ యాజమాన్యానికి షాక్ తప్పలేదు.
* మిగులు భూమి ప్రత్యామ్నాయ అవసరాల కోసం..
కొన్ని దశాబ్దాల కిందట విశాఖలో రామానాయుడు స్టూడియోస్ కు భూములు కేటాయించింది అప్పటి ప్రభుత్వం. అయితే స్టూడియో ఏర్పాటు చేయగా చాలా భూమి మిగిలింది. అలా మిగిలిన 14 ఎకరాల భూమిని ఇతర అవసరాలకు వాడుకునేందుకు గత వైసిపి సర్కార్( YSR Congress government ) అనుమతి ఇచ్చింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఆ భూమిని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు ఇచ్చింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈరోజు ఆర్పిటిషన్ విచారణకు వచ్చింది.
* కొంతకాలంగా వివాదం..
అయితే గత కొంతకాలంగా ఈ భూములపై వివాదం నడుస్తోంది. అప్పట్లో కొందరు వైసీపీ పెద్దలు రంగ ప్రవేశం చేసి సురేష్ ప్రొడక్షన్స్ తో( Suresh productions ) ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ తరుణంలోనే ప్రభుత్వం స్పందించింది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేతకు నోటీసులు జారీచేసింది. దీనిపైనే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు లోని జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం ఈ కేసులో మద్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై సంబంధిత కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. దీంతో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు సురేష్ ప్రొడక్షన్స్ అనుమతి కోరింది. సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ పిటీషన్ ను వెనక్కి తీసుకుంది సురేష్ ప్రొడక్షన్స్.
* భూములు కేటాయించింది టిడిపి ప్రభుత్వమే..
వాస్తవానికి రామానాయుడు స్టూడియోస్కు భూములు కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వమే( TDP government). అప్పట్లో నిర్మాత రామానాయుడు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు. ఆ పార్టీ నుంచి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. విశాఖలో సినిమా షూటింగులకు అనుకూలంగా స్టూడియో నిర్మిస్తానని.. భూములు కేటాయించాలని అప్పటి టిడిపి ప్రభుత్వాన్ని కోరడంతో.. దాదాపు 30 ఎకరాల వరకు భూములు కేటాయించారు. అందులో 14 ఎకరాల వరకు మిగులు భూమి ఉంది. అయితే ఆ భూమిని ప్రత్యామ్నాయంగా వాడుకుంటామని యాజమాన్యం చేసిన విన్నపానికి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారన్నది కూటమి ప్రజాప్రతినిధుల అనుమానం. తాజాగా సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను డిస్మిస్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.