Ramachandrapuram YCP : అధికార వైసీపీలో కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. వైరి వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. మొన్నటివరకూ ప్రత్యర్థులపై జరిగిన దాడులు ఇప్ఫుడు సొంత పార్టీ శ్రేణుల వైపు మళ్లాయి. తాజాగా కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో సొంత పార్టీ నేతపైనే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ అనుచరులు దాడి చేశారు. దీంతో బాధిత నేత మనస్తాపంతో చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో అధికార వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరింత ముదిరిపాకాన పడ్డాయి. మంత్రి చెల్లిబోయిన వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలు పొడచూపాయి. హైకమాండ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో మంత్రి వేణుకు గట్టి షాకివ్వాలని బోస్ భావిస్తున్నారు. కుమారుడు సూర్యప్రకాష్ ను బరిలో దించాలని భావిస్తున్నారు. కుదిరితే వైసీపీ అభ్యర్థిగా.. కుదరకుంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పెట్టడానికి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మొన్న వైఎస్సార్ జయంతి నాడు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రామచంద్రాపురం నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు జరిగితే..ఐదు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడాన్ని కేస్ స్టడీస్ గా భావిస్తున్నారు. అందుకే నియోజకవర్గంలో దూకుడు పెంచారు. ఇటీవల రెండు వేల మందితో భారీ బహిరంగసభ నిర్వహించారు. వైసీపీ టిక్కెట్ గురించి ప్రయత్నిద్దామని.. లేకుంటే మాత్రం సూర్యప్రకాష్ ను ఇండిపెండెంట్ పోటీచేయిద్దామని బాహటంగానే బోస్ వర్గీయులు ప్రకటించారు.
రామచంద్రాపురం మునిసిపాల్టీ పరిధిలోని మచ్చుమిల్లి సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి చెల్లబోయినతో పాటు ఆయన వర్గం మొత్తం హాజరైంది. సొంత వార్డు కావడంతో మునిసిపల్ వైస్ చైర్మన్ కోలమూరి శివాజీ అక్కడకు చేరుకున్నారు. కాసేపటికే మంత్రి అనుచరుడు ఉదయ్ కాంత్ ప్రశ్నల వర్షం కురిపించాడు. మంత్రి నీకు పదవి ఇస్తే ఆయన్నే వ్యతిరేకిస్తావా? అంటూ కాలర్ పట్టుకున్నాడు. అతడిపై చేయిచేసుకున్నాడు. తీవ్ర మనస్తాపంతో ఇంటికి చేరుకున్న శివాజీ చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో మంత్రి, ఎంపీ వర్గాలు పరస్పరం నిందించుకుంటున్నాయి.
బోస్ సొంత నియోజకవర్గం రామచంద్రాపురం. 2012 ఉప ఎన్నికల్లో బోస్ ఓడిపోయారు. 2014లో సైతం టిక్కెట్ ఇచ్చినా నెగ్గలేకపోయారు. దీంతో 2019లో రామచంద్రాపురం నియోజకవర్గానికి చెల్లబోయినకు కేటాయించారు. బోస్ కు మండపేట నుంచి రంగంలో దించారు. చెల్లుబోయిన గెలిచినా.. బోస్ నెగ్గలేదు. పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీగా ఉన్న బోస్ ను మంత్రిని చేశారు. కానీ అనూహ్యంగా రాజ్యసభకు ఎంపిక చేయడంతో బోస్ మంత్రి పదవి వదులుకోవాల్సి వచ్చింది. అయితే బోస్ వదులుకున్న మంత్రి పదవిని అదే సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణకు అప్పగించారు. అప్పటి నుంచి బోస్ వర్గాన్ని ఎంతలా అణచివేయాలో అంతలా తొక్కేస్తున్నారు. విషయం గ్రహించిన బోస్ హైకమాండ్ పెద్దలకు ఫిర్యాదుచేశారు. కానీ అంతా లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బోస్ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు.