Rajampet MP Mithun Reddy: ఏపీలో( Andhra Pradesh) ఆసక్తికరంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో కీలక అరెస్టులు ప్రకంపనలు రేపాయి. మరోవైపు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ కోసం ప్రత్యేకత బృందాలు జల్లెడ పడుతున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణంలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు మిధున్ రెడ్డి. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రాగా ఆ పిటీషన్ డిస్మిస్ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. దీంతో మిధున్ రెడ్డి అరెస్ట్ కు మార్గం సుగమం అయింది. ప్రస్తుతం మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది కేంద్రం. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం గాలిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన అరెస్టు తప్పదని తేలుతోంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అప్పటి సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి తదితరులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ జాబితాలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేరనున్నారు.
అప్పట్లో మినహాయింపు..
వాస్తవానికి మద్యం కుంభకోణం పై( liquor scam ) ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన సమయంలోనే.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. అయితే తనకు ఈ కేసుతో కనీసం సంబంధం లేదని.. అయినా సరే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో అజ్ఞాతంలోకి వెళ్లి మరి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే తాము ఎఫ్ఐఆర్లో కనీసం మిథున్ రెడ్డి పేరు చేర్చలేదని ఏపీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. అయితే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ కు తొందర పడవద్దని.. ఆయన విచారణకు సహకరిస్తారని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే మద్యం కుంభకోణంలో మిధున్ రెడ్డి పాత్ర పై పక్కా ఆధారాలు సేకరించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే హైకోర్టు మిధున్ రెడ్డి పై చర్యలు వద్దని సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఎటువంటి పరిశీలన చేయకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం వాదించగా.. మరోసారి బెయిల్ పిటిషన్ పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది సుప్రీంకోర్టు. ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని ఆధారాలు సమర్పించడంతో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read: Rayalaseema Political Strategy: చంద్రబాబు గురి.. రాయలసీమపై భారీ స్కెచ్!
అత్యున్నత న్యాయస్థానంలో షాక్..
అయితే తుది ప్రయత్నం గా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి( Mithun Reddy ) అజ్ఞాతంలో ఉంటూనే.. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై ఈరోజు విచారణ జరిగింది. అయితే తుది దశలో విచారణ, పక్క ఆధారాలు ఉండడంతో బెయిల్ ఇవ్వలేమని చెప్పి పిటీషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. దీంతో ఏ క్షణం అయినా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే దర్యాప్తు బృందాలు ఆయన కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ జరిగితే పెను సంచలనమే. మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాగా.. ఆయన వెనుక ఉండి నడిపించింది పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అని సిట్ అనుమానిస్తోంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా కీలక నేత చుట్టూ ఉచ్చు బిగించాలని భావిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..