AP Rain Alert: ఏపీకి బిగ్ అలెర్ట్

ఉపరితల ఆవర్తన ప్రభావంతో బలమైన ఈదురు గాలులు విస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా ఏలూరు, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 6, 2024 4:07 pm

AP Rain Alert

Follow us on

AP Rain Alert: ఏపీ ప్రజలకు శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గతం కంటే వేగంగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినా.. జూన్ లో ఆశించినంతగా వర్షాలు పడలేదు. చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటు కనిపిస్తోంది. వాతావరణం వ్యాసముని తలపిస్తోంది. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఖరీఫ్ సైతం ఆలస్యమవుతోంది. ఇటువంటి తరుణంలో రాష్ట్రానికి వాతావరణ శాఖ శుభవార్త వినిపించింది. తూర్పు బంగాళాఖాతంలో ఆవర్తనంతో పాటు గుజరాత్, కర్ణాటక తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా తో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

సాధారణంగా జూన్ లో వర్షపాతం నమోదు ఎక్కువ. ఏటా రెండో వారం నాటికి రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాలు సమృద్ధిగా పడతాయి. ఈ ఏడాది జూన్ 2 నాటికి రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ వర్షాలు మాత్రం ఆశాజనకంగా పడలేదు. దీంతో రైతుల్లో నిరాశ ఆలుముకుంది. ఇప్పటికీ వేసవి వాతావరణం తలపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉపరితల ఆవర్తనాలతో వర్షాలు పడతాయని తాజాగా వాతావరణ శాఖ ప్రకటించడం ఆనందాన్నిస్తోంది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో బలమైన ఈదురు గాలులు విస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా ఏలూరు, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నంద్యాల, సత్య సాయి, కడప, అన్నమయ్య, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పిడుగులు పడడంతో పాటు తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు ఈరోజు రాత్రి తిరుపతిలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.