Raghurama Krishnam Raju
Raghurama Krishnam Raju: ఎంపీ రఘురామకృష్ణంరాజు పరిస్థితి ఏంటి? ఆయన ఏ పార్టీలో చేరతారు? ఎన్డీఏ నుంచి పోటీ చేస్తారా? లేకుంటే ఎక్కడైనా ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణంరాజు ఎంపీగా గెలుపొందారు. గెలిచిన కొద్ది రోజులకే వైసిపి నాయకత్వంతో విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటినుంచి రెబల్ గా మారారు. వైసీపీకి కంటి మీద నలుసుగా వ్యవహరించారు. అటు బిజెపితో పాటు ఇటు టిడిపితో మంచి సంబంధాలు కొనసాగించారు. వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యల కైనా దిగేందుకు వెనుకడుగు వేయలేదు. ఆయనకు మూడు పార్టీల్లో.. ఏదో ఒక పార్టీ నుంచి టిక్కెట్ ఖాయమని ప్రచారం జరిగింది. ముఖ్యంగా బీజేపీ నుంచి ఆయన బరిలో దిగుతారని టాక్ నడిచింది. కానీ బిజెపి టికెట్ కేటాయించలేదు. దీంతో టీడీపీ తో పాటు జనసేనలో కూడా ఆయనకు చాన్స్ లేకుండా పోయింది.
గత ఐదు సంవత్సరాలుగా బిజెపి పెద్దలతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. వైసీపీ కంటే బీజేపీ నేతగానే చెప్పుకునేందుకు ఇష్టపడ్డారు. ఏపీ పరంగా టిడిపి తో పాటు జనసేన కు మద్దతు తెలుపుతూనే.. జాతీయస్థాయిలో మాత్రం బిజెపికి సన్నిహితంగా మెలిగారు. బిజెపి నుంచి తనకు టికెట్ ఖాయమని ధీమాగా కూడా ఉండేవారు. కానీ బిజెపి హై కమాండ్ హ్యాండిచ్చింది. నరసాపురం ఎంపీ టికెట్ను భూపతి రాజు శ్రీనివాస వర్మకు కేటాయించింది. టిడిపి తో పాటు జనసేన సైతం అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. దీంతో రఘురామకృష్ణంరాజుకు టికెట్ లేకుండా పోయింది. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీకి వ్యతిరేకంగా.. విపక్షాలకు అనుకూలంగా వ్యవహరించిన రఘురామకృష్ణంరాజును వైసీపీ టార్గెట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో స్పందించిన రఘురామకృష్ణం రాజు తాను ఎన్డీఏ నుంచి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టడం ఖాయమని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు ఆ మూడు పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో రఘురామరాజుకు చాన్స్ లేకుండా పోయింది.అయితే తాజాగా రఘురామరాజును ఎలాగైనా ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఎట్టి పరిస్థితుల్లో రఘురామకృష్ణం రాజుకు టికెట్ ఇవ్వాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య బలమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు పార్లమెంట్ సీటు కేటాయిస్తారా? అసెంబ్లీ సీట్లు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో ఏదో ఒకచోట ఆయనకు సర్దుబాటు చేస్తారని మాత్రం తెలుస్తోంది. ఎన్నికలకు సమయం ఉండడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. అయితే ఎక్కడో కాదు నరసాపురం ఎంపీ సీటును కేటాయిస్తే.. రఘురామకృష్ణం రాజు సత్తా ఏంటో తెలుస్తుందని ఆయన అభిమానులు చెబుతున్నారు. అక్కడి సీటు కావాలని కోరుతున్నారు. మరి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.