Raghurama Krishna Raju : తెలుగుదేశం పార్టీలో రఘురామకృష్ణం రాజుకు చాలా గౌరవం దక్కుతోంది. ఎన్నికల్లో అసలు రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తారో? లేదో?అన్న అనుమానాలు ఉండేవి. 2019లో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణంరాజు. అక్కడకు కొద్ది నెలలకే వైసీపీతో విభేదించడం ప్రారంభించారు. క్రమేపి ఆ పార్టీకి ప్రత్యర్థిగా మారిపోయారు. జగన్ కు వ్యతిరేకంగా గళం ఎత్తారు. సహజంగానే ఇది తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చే అంశం. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు.అలాగని ఆ పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదు. బిజెపి అగ్రనేతలతో సంబంధాలు ఉండడంతో అదే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు రఘురామకృష్ణంరాజు. చివరి వరకు అదే నమ్మకంతో ఉండేవారు. నరసాపురం ఎంపీ టికెట్ తనదేనని భావించేవారు.కానీ ఆ టికెట్ అనూహ్యంగా శ్రీనివాస వర్మ కు వెళ్లిపోయింది. బిజెపిలోని ప్రోవైసిపీ నేతలు పావులు కదపడంతో రఘురామకృష్ణం రాజుకు టికెట్ దక్కకుండా పోయింది. ఈతరుణంలోనే చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఉండి నియోజకవర్గాన్ని కేటాయించారు. అలా రఘురామకృష్ణం రాజు అవమానం పడకుండా చంద్రబాబు ఆదుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రఘురామకృష్ణం రాజుకు రకరకాల పదవులు వస్తాయని ప్రచారం జరిగింది. కానీ సామాజిక సమీకరణలో భాగంగా చంద్రబాబు ఏ పదవి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పోస్టును కట్టబెట్టారు.రఘురామకృష్ణం రాజు పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అదే విషయంపై రఘురామకృష్ణంరాజు సైతం కృతజ్ఞతా భావంతో ఉన్నారు. జగన్ తనను అవమానిస్తే.. చంద్రబాబు తనను అభిమానిస్తూ ఆదరించారని గుర్తు చేస్తున్నారు రఘురామకృష్ణం రాజు.
* జగన్ వద్ద అగౌరవం
2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రఘురామకృష్ణంరాజు.ఆ ఎన్నికల్లో గెలిచారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు కావడంతో తనకు గౌరవం దక్కుతుందని భావించారు.కానీ అలా జరగలేదు. గెలిచిన ఆరు నెలలకే క్రమేపి రఘురామకృష్ణం రాజు పార్టీకి దూరంగా జరుగుతూ వచ్చారు. కానీ నిలువరించే ప్రయత్నం చేయలేదు. రఘురామకృష్ణంరాజులో ఉన్న అసంతృప్తిని తగ్గించే ఏ ప్రయత్నము జగన్ నుంచి లేకుండా పోయింది. క్రమేపి వైసిపి తో పాటు అధినేతకు బద్ధ శత్రువుగా మారిపోయారు రఘురామకృష్ణం రాజు. ఈ క్రమంలో జగన్ సర్కార్ పెట్టిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. పుట్టినరోజు నాడు హైదరాబాదులో రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చారు. చిత్రహింసలు పెట్టారు. చివరకు కోర్టుకు సంప్రదించి బయట పడాల్సి వచ్చింది.
* రాజ ద్రోహం కేసు
నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజుకు సొంత నియోజకవర్గంలో తిరిగేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. ఒకటి రెండుసార్లు సొంత నియోజకవర్గానికి రావడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నారు. రాజ ద్రోహం కేసు పెట్టి వేధించారు. చివరకు బిజెపి నుంచి టికెట్ రాకుండా కూడా అడ్డుకున్నారు.అయితే రఘురామకృష్ణం రాజు పై కేసుల నమోదు తో పాటు పోలీసు దాడిని కూడా చంద్రబాబు ఖండించారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. న్యాయపరంగా తనవంతు సాయం అందించారు. రాజకీయ ఉన్నతికి కూడా పాటుపడ్డారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చి గౌరవించారు. అదే విషయాన్ని తాజాగా గుర్తు చేస్తున్నారు రఘురామకృష్ణంరాజు. జగన్ తనను అగౌరవపరిస్తే.. చంద్రబాబు మాత్రం గౌరవంగా చూసుకున్నారని చెప్పుకొస్తున్నారు.