Raghurama Krishnam Raju: ఏపీలో గెలుపు పై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయం తమదంటే తమదని చెప్పుకొస్తున్నాయి. 150కి పైగా సీట్లు సాధిస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 120 కి పైగా స్థానాలు దక్కించుకుంటామని కూటమి నేతలు సైతం చెప్పుకొస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీలో ఆ ధీమా కనిపించకపోగా.. కూటమి పార్టీల్లో మాత్రం జోష్ కనిపిస్తోంది. మంత్రివర్గ కూర్పుతో పాటు స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందా అన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే.. రఘురామకృష్ణం రాజును స్పీకర్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. జగన్ పై రివెంజ్ కు ఆయన అయితే సరిపోతారని.. వైసిపి బ్యాచ్ ఆయనకు అధ్యక్ష అనాల్సిందేనని.. అలా అయితేనే ప్రారంభం నుంచి పైచేయి సాధించవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గెలిచిన ఆరు నెలలకే వైసీపీకి దూరమయ్యారు. వైసిపి నాయకత్వంతో విభేదించారు. ఆ పార్టీకి టార్గెట్ అయ్యారు. సొంత పార్టీని ఇరుకున పెట్టారు. అయితే ఈ క్రమంలో సొంత పార్టీ నుంచి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో సిఐడి ఆయన్ను అదుపులో తీసుకొని చేయి చేసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అప్పుడే ఆయన శపధం చేశారు. వైసిపి ఓటమికి తన వంతు ప్రయత్నం చేస్తానని సవాల్ చేశారు. అందుకు తగ్గట్టుగానే వ్యవహరించారు. టిడిపి బిజెపి కలవడం వెనుక రఘురామకృష్ణంరాజు కృషి కూడా ఉంది. అయితే నరసాపురం ఎంపీ టికెట్ ఆశించారు రఘురామకృష్ణంరాజు. అది కూడా బిజెపి నుంచే. కానీ ఆ సీటు దక్కలేదు. అలా దక్కకపోవడం వెనుక జగన్ కుట్ర ఉందని రఘురామ అనుమానించారు. తాను శాసనసభకు ఎన్నికై, స్పీకర్ ను అవుతానని.. అదే జగన్ తో అధ్యక్షా అని పిలిపించుకుంటానని కూడా తేల్చి చెప్పారు. తద్వారా తనకు స్పీకర్ పదవి చేయాలని ఉందని మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఎంపీ టికెట్ దక్కకపోవడంతో చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరారు రఘురామకృష్ణంరాజు. ఉండి అసెంబ్లీ సీటును దక్కించుకున్నారు.అక్కడ టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా.. ఖాళీ చేయించి మరి సీటు ఇప్పించారు చంద్రబాబు. ఒకవేళ ఉండి నుంచి ఎమ్మెల్యేగా రఘురామరాజు ఎన్నికై.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా స్పీకర్ పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో తనకు ఎదురైన పరిణామాల దృష్ట్యా రఘురామకృష్ణంరాజు కూడా స్పీకర్ పదవిని బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు మూడు పార్టీల కలయిక నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు కూడా కష్టతరంగా మారనుంది. అందుకే మంత్రి పదవి ఇవ్వాల్సిన రఘురామకు చంద్రబాబు తప్పకుండా స్పీకర్ పదవితో సరిపెడతారని టాక్ నడుస్తోంది.