Raghu Rama Krishna Raju: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు పార్టీలు కూటమి కట్టి అభ్యర్థులను ప్రకటించాయి. బిజెపి టికెట్ ఆశించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఆ పార్టీ షాక్ ఇచ్చింది. ఆయన ఆశించిన నరసాపురం సీటును భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేటాయించింది. అయితే దీనంతటికీ వైసీపీ కారణమని రఘురామ ఆరోపించారు. సోము వీర్రాజు ద్వారా జగన్ అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు. మున్ముందు పాతాళానికి జగన్ ను తొక్కి పెట్టేస్తానని కూడా రఘురామా ప్రకటన చేశారు. అయితే అందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించారు. జగన్ పై ఏకంగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆయన ఎన్నికల వ్యయాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. దీంతో ఇదో హాట్ టాపిక్ గా మారింది.
గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన రఘురామకృష్ణంరాజు విజయం సాధించారు. కానీ ఆరు నెలలకే వైసిపి హై కమాండ్ కు దూరమయ్యారు. పూర్తిగా రెబల్ గా మారిపోయారు. ఏకంగా సీఎం జగన్ తో పాటు వైసీపీ సర్కార్ను టార్గెట్ చేసుకునేవారు. ప్రతిరోజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేవారు. దీంతో వైసిపి హై కమాండ్ ఆయనపై ధిక్కరణ వేటు వేయాలని ప్రయత్నాలు చేసింది కానీ.. వర్కౌట్ కాలేదు. దీంతో రాజ ద్రోహం కేసు పెట్టింది. కానీ అది కోర్టులో నిలబడలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు మరింత రెచ్చిపోయారు. జగన్ సర్కార్ అవినీతిపై వరుసుగా కేసులు వేశారు. అవి కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ ఏకంగా సీఎం జగన్ పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా సీఎం జగన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం కోసం రెండు హెలిక్యాప్టర్లను వినియోగిస్తున్నారు. విజయవాడలో ఒకటి, విశాఖలో ఒకటి ఉంటుందని ఆ మధ్యన ఒక ప్రత్యేక ప్రకటన ఇచ్చారు. అయితే ఈ రెండింటికి రూ.3.80 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రజాధనం అని.. ఎన్నికల వ్యయం కింద పరిగణలోకి తీసుకోవాలని రఘురామ ఎలక్షన్ కమిషన్ కుఫిర్యాదులో కోరారు. ఇది కచ్చితంగా ఉల్లంఘన కిందే వస్తుందని చెప్పుకొచ్చారు. తక్షణం సీఎం జగన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు జగన్ పై అవినీతి కేసుల విషయంలో వేగవంతం చేయాలని రఘురామ భావిస్తున్నారు. మొత్తానికైతే రఘురామ పగ కొనసాగుతోంది.