AP Assembly Election Results 2024: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో పోలిస్తే.. చంద్రబాబుది ఓ కష్టమా..

టిడిపికి డప్పు కొట్టే విషయంలో ఆంధ్రజ్యోతి ఎన్నడూ వెనక్కి తగ్గదు. వెనక్కి తగ్గలేదు కూడా.. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ముక్కుసూటి తనాన్ని అభినందించక తప్పదు.

Written By: Dharma, Updated On : June 6, 2024 2:51 pm

AP Assembly Election Results 2024

Follow us on

AP Assembly Election Results 2024: పార్టీ జెండా మోయడం.. పార్టీ కండువా కప్పుకోవడం.. ప్రజల్లోకి వెళ్లడం ఒక నాయకుడికి పెద్ద ఇబ్బంది కాదు. అదే న్యూట్రల్ ముసుగు వేసుకొని.. పార్టీకి డప్పు కొట్టడం… పార్టీకి బాకాలు ఊదడం అంత ఈజీ కాదు.. తెలుగు నాట ఇలాంటి సంస్కృతికి ఈనాడు బీజం వేస్తే.. దానిని మరింత తారస్థాయికి తీసుకెళ్ళింది ఆంధ్రజ్యోతి.. సాక్షి సుద్దపూసా అని మీకు డౌట్ రావచ్చు.. కాకపోతే అది ఎప్పుడూ న్యూట్రల్ ముసుగు వేసుకోలేదు. దాందంతా ఓపెన్ వ్యవహారమే.. మాస్టర్ హెడ్ పక్కన వైయస్ బొమ్మ పెట్టుకుని.. నేను వైసీపీ క్యాంపు కరపత్రికను అని చెప్పేసుకుంటుంది..

టిడిపికి డప్పు కొట్టే విషయంలో ఆంధ్రజ్యోతి ఎన్నడూ వెనక్కి తగ్గదు. వెనక్కి తగ్గలేదు కూడా.. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ముక్కుసూటి తనాన్ని అభినందించక తప్పదు. ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు… ఆయన పదేపదే ప్రస్తావించే ఆ రెండు పత్రికలలో ఆంధ్రజ్యోతి కూడా ఉంది. అప్పట్లో ప్రభుత్వం నుంచి ప్రకటనలు రానప్పుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు యాడ్స్ ఇవ్వనప్పుడు నిలబడింది. చంద్రబాబు ఆర్థిక సాయం చేశాడని అంటారు కానీ.. అలాంటి ఆర్థిక సాయం తీసుకున్నప్పటికీ పత్రికను నిలబెట్టాలంటే మామూలు విషయం కాదు. పైగా ఆ రోజుల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తిస్థాయిలో పట్టు ఉండేది. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత.. ఆంధ్రజ్యోతికి కేసీఆర్ రూపంలో మరో ఇబ్బంది ఉండేది.. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లల్లోనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిషేధం ఎదుర్కొంది.. అది కొన్నాళ్లపాటు సాగింది.. ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్లి రాధాకృష్ణ కేసీఆర్ పై గెలిచారు..

తెలంగాణలో కేసీఆర్ తో ఇబ్బంది పడుతుంటే.. ఏపీలో చంద్రబాబు అధికారం కోల్పోవడం.. జగన్ అధికారంలోకి రావడంతో.. అతనితోనూ ఢీ కొట్టాల్సిన పరిస్థితి ఆంధ్రజ్యోతికి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ప్రకటనలు రాకపోవడం.. గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను జప్తు చేయడం.. ఒకానొక దశలో ప్రింటింగ్ ను నిలిపి వేసేందుకు ప్రయత్నాలు జరగడంతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. అయినప్పటికీ.. అన్ని కష్టాలలోనూ ఆయన ఎదురీదుకుంటూ వచ్చారు.. ఒకరకంగా ఒక ప్రధాన పత్రికను ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటనలు రాకుండా.. ఐదేళ్లపాటు నడపడం అంత సులభం కాదు. కానీ దాన్ని చేసి చూపించారు రాధాకృష్ణ. ఈనాడు నాలుగేళ్లుగా ప్రభుత్వ ప్రకటనలు తీసుకుంది. చివరి ఏడాది మాత్రం జగన్ తో వైరం వల్ల వద్దనుకొంది. ఇంత మాత్రం వెసులుబాటు కూడా ఆంధ్రజ్యోతికి లభించలేదు.

టిడిపి గొంతుకను ఆంధ్రజ్యోతి బలంగా వినిపించింది. ఐదు సంవత్సరాలలో ప్రభుత్వపరంగా జరిగిన ప్రతి అవకతవకను నిర్మొహమాటంగా బయట పెట్టింది.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తనకు ప్రతిపక్షం కాదని.. కేవలం ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రమేనని పదేపదే జగన్ అన్నారంటే.. రాధాకృష్ణ ఏ స్థాయిలో భయపెట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ఏపీలో రాధాకృష్ణ కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. పదేళ్ల ఎదురుచూపు తర్వాత రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రెండు రాష్ట్రాలలో తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తులు ముఖ్యమంత్రులు కావడంతో రాధాకృష్ణ ఆనందానికి అవధులు లేవు. ఇన్ని కష్టాలు పడి.. టిడిపి గొంతుకగా పనిచేసి.. టిడిపి విజయానికి కృషిచేసిన రాధాకృష్ణ త్యాగంతో పోల్చితే.. చంద్రబాబు కష్టం ఓ కష్టమా?!