Ramoji Rao Vs Jagan: జగన్ ను విమర్శిస్తూ.. పరిపాలన తీరును ఎండగడుతూ.. పేజీలకు పేజీల వార్తలు రాసి.. కథనాలకు కథనాలు కుమ్మేసింది ఈనాడు. ఈ స్థాయిలో ఎప్పుడూ రాయలేదు. భవిష్యత్తులో రాస్తుందో కూడా తెలియదు. ఒకరకంగా రామోజీరావుకు జీవన్మరణ సమస్య. అంతటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా మార్గదర్శి విషయంలో అంతగా గెలుక్కోలేదు.. కానీ, జగన్ మొండిఘటం కదా…వదిలిపెట్టలేదు.. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత… జగన్ పై ఈనాడు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. జగన్ కూడా రామోజీని పట్టించుకోలేదు. అప్పట్లో ఏదో ఒక ఫంక్షన్ లో రామోజీరావుకు అభివాదం చేశాడు. ఓసారి ప్రత్యేకంగా వెళ్లి కలిశాడు. కాల్పుల ఒప్పంద విరమణ జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ కొద్ది రోజులకే జగడం మొదలైంది. ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి, గెట్టు పంచాయితీలు ఆగలేదు. వ్యక్తుల మధ్య తేడాలు.. వ్యవస్థల దాకా వెళ్లాయి.. జగన్ ఊరుకోలేదు. మహా మహులు సైతం రామోజీరావును కలిసేందుకు ఫిలిం సిటీకి వెళ్తుంటారు. అంతటి అమిత్ షా కూడా రామోజీని కలిసేందుకు ఫిలిం సిటీ కి వెళ్ళాడు తప్ప.. నోవాటెల్ హోటల్ కి పిలిపించుకోలేదు. జగన్ మాత్రం రామోజీ వద్దకు ఏపీ సిఐడిని పంపించాడు.. అప్పట్లో అది పెద్ద సంచలనమైంది. శైలజను విచారించాడు. మార్గదర్శి చిట్స్ సేకరించకుండా ఎక్కడికి అక్కడ నిలుపుదల చేశాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ తో కలిసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఒకరకంగా రామోజీరావును నడి బజార్లో నిలబెట్టాడు. ఇంత జరిగిన తర్వాత రామోజీరావు ఊరుకుంటాడా.. ఊరుకోలేదు.
చరిత్రలో తొలిసారిగా తన పేపర్లో జగన్ ఒక నియంత అని, ఒక రాక్షసుడని, ఒక హిట్లర్ అని సూత్రికరించాడు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో పేజీలకు పేజీలు వార్తలు రాయించాడు. తన ఈనాడు ఛానల్ లో పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రసారం చేయించాడు. జగన్ చేపట్టిన ప్రతి పనిని విమర్శించాడు. ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అవినీతిమయమని రాసేశాడు. ఒకానొక దశలో ఈనాడును ఆంధ్రజ్యోతిని మించిపోయేలా చేసాడు. అడ్డగోలు విమర్శలకు దిగాడు. రామోజీరావు ఈనాడు రాయడం, జగన్ సాక్షి కౌంటర్ ఇవ్వడం.. ఇలా జరిగిపోయింది.. అయితే ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారునేది అంతుపట్టలేదు. ఒకవేళ మళ్లీ జగన్ వస్తే టిడిపి అనుకూల మీడియాను మరింత లోతుగా తొక్కిపడేసేవాడు. కానీ అలా జరగలేదు.
గత ఎన్నికల్లో 151 సీట్లు దక్కించుకున్న వైసిపికి.. 11 మాత్రమే మిగిలాయి. ఈనాడు ఊహించని సీట్లు కూటమికి దక్కాయి. రామోజీరావు కోరుకున్నది ఇదే కాబట్టి ఆయన ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఈ ఐదేళ్లపాటు జగన్ పెట్టిన ఇబ్బందులను తట్టుకున్నాడు.. వేధింపులను సహించాడు. తన ఆర్థిక మూలాలను దెబ్బ కొడుతుంటే భరించాడు. కానీ ఇక ఇప్పుడు ఊరుకోడు. తవ్వుతుంటాడు. మరింత లోతుగా పెకిలిస్తాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అడ్డగోలుగా రాసిన రామోజీ.. ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉంటాడు.. ఈనాడుతో పోలిస్తే సాధన సంపత్తి విషయంలో సాక్షి ఒక మెట్టు పైనే ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా నోచుకోని దురవస్థలో ఉంది. ఇప్పుడు ఈనాడు సంధించే శరాల నుంచి సాక్షి జగన్ ను ఎలా రక్షించుకుంటుందనేది చూడాల్సి ఉంది.. ఒకటి మాత్రం నిజం. ఈ ఐదేళ్లలో ఈనాడు పోషించిన పాత్రను సాక్షి స్వీకరించాల్సి ఉంటుంది. కనీసం ఇప్పుడైనా ఉపయోగపడితేనే జగన్ రాజకీయంగా మళ్ళీ లేవగలడు. నిలబడగలడు.