IPS Officer PV Sunil Kumar: సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్( PV Sunil Kumar ) వెనక్కి తగ్గడం లేదు. గతంలో సిఐడి చీఫ్ గా వ్యవహరించేవారు. వైసిపి ప్రభుత్వం పెద్దల ఆదేశాలు పాటించే వారన్న విమర్శ ఆయనపై ఉంది. ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఆయన రాజకీయ అంశాలను ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల కాపు, దళిత ఐక్యతపై ఆయన కామెంట్స్ చేశారు. ఐపీఎస్ అధికారిగా ఉన్న సునీల్ కుమార్ రాజకీయ అంశాలు ఎలా మాట్లాడుతారు అంటూ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. కానీ దానిని పట్టించుకునే స్థితిలో లేరు సునీల్ కుమార్. మరోసారి కాపు, దళిత కలయిక పై కీలక కామెంట్స్ చేశారు. ఆయన మాటలను చూస్తుంటే కాపు, దళిత, బీసీ సామాజిక వర్గాలను ఏకం చేసే పనిలో ఉన్నారని అర్థమవుతోంది. అందులో భాగంగా విశాఖలో ఈనెల 26న నిర్వహించనున్న ‘రంగనాడు’ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునివ్వడం విశేషం.
26న భారీ బహిరంగ సభ..
వంగవీటి మోహన్ రంగ( vangaveeti Mohan Ranga) వర్ధంతి ఈనెల 26న జరగనుంది. రంగా రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో విశాఖలో రంగనాడు పేరిట సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్ తెరపైకి వచ్చారు. వర్ధంతి సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే ఈ సభ ద్వారా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ పై సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే సభను విజయవంతం చేయాలని ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కోరడం కొత్త చర్చకు దారితీస్తోంది.
పక్కా ప్రణాళికతోనే..
పక్కా ప్రణాళికతోనే సునీల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది. ముఖ్యంగా కాపు నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే ఈ కామెంట్స్ చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాపులకు ఆరాధ్య దైవంగా వంగవీటి మోహన్ రంగా ఉంటారు. కాపు సామాజిక వర్గం ఆదరణ దక్కించుకునే వ్యూహంలో సునీల్ కుమార్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. విశాఖలో రంగనాడు సభకు అందరూ రావాలని ఆయన కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దళితుల్లో ఇప్పటికే బలమైన నెట్వర్క్ తో ఉన్నారు సునీల్ కుమార్. ఇప్పుడు మోహన్ రంగా ద్వారా కాపులను ఆకర్షించగలిగితే ఏపీ రాజకీయాలను మార్చవచ్చన్న ఆలోచన ఆయనదిగా కనిపిస్తోంది. ఒకవైపు రంగా రాధా మిత్రమండలి, ఇంకోవైపు మోహన్ రంగా కుమార్తె ఆశాకిరణ్, ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పిలుపు చూస్తుంటే అందరి దృష్టి విశాఖ పైనే పడింది. ఈనెల 26న విశాఖలో జరిగే సభలో రాజకీయ నిర్ణయాలు ఉండబోతున్నాయి అన్న టాక్ ఉంది. అందుకే అందరి దృష్టి అటువైపు పడింది.