PV Sunil Vs Raghurama Krishnam Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వర్సెస్ ఐపీఎస్ సునీల్ కుమార్ అన్నట్టు పరిస్థితి మారింది. ఐపీఎస్ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు ఏపీ డీజీపీకి ఒక లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య వివాదం నడుస్తోంది. బ్యాంకు రుణాలకు సంబంధించి డిఫాల్టర్ గా ఉండడం పై రఘురామకృష్ణంరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలని సునీల్ కుమార్ కోరారు. దీనిపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. దీనిపై రఘురామకృష్ణంరాజు సీరియస్గా స్పందించారు. ఒక ఐపీఎస్ అధికారి రాజకీయ పార్టీ నేతగా ఎలా మాట్లాడుతారు అంటూ ప్రశ్నించారు. దీంతో వరుసగా రెండు వీడియోలు విడుదల చేశారు సునీల్ కుమార్. ఇప్పుడు ఇదే ఏపీవ్యాప్తంగా హాట్ టాపిక్.
* కొద్ది రోజులకే తిరుగుబాటు..
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎంపీగా ఉన్నారు రఘురామకృష్ణంరాజు. ఎంపీగా గెలిచిన కొద్ది రోజులకే ఆ పార్టీకి దూరమయ్యారు. రెబల్ గా మారిపోయారు. అప్పటి వైసిపి ప్రభుత్వం రఘురామకృష్ణంరాజు పై రాజద్రోహం కేసు నమోదు చేసింది. అప్పటి సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేశారు. అప్పట్లో కస్టోడియన్ టార్చర్ పెట్టారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. తనను చిత్రహింసలు పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు రఘురామకృష్ణంరాజు. అప్పటి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై కేసు కూడా నమోదయింది. త్వరలో ఆయన అరెస్టు ఉంటుందని ప్రచారం సాగింది. రఘురామ కృష్ణంరాజు సైతం త్వరలో సునీల్ కుమార్ అరెస్ట్ ఉంటుందని ప్రకటన చేశారు.
* ఇతరులు సైలెన్స్..
ఇటీవల ఐపీఎస్ సునీల్ కుమార్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపు, దళితులు కలిస్తే రాజ్యాధికారం దక్కుతుందని అభిప్రాయపడ్డారు సునీల్ కుమార్. ఒక ఐపీఎస్ అధికారిగా ఉంటూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారంటూ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. అయితే రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన బ్యాంక్ డిఫాల్ట్ కేసును కూడా ప్రస్తావించారు సునీల్ కుమార్. ఇప్పుడు ఇలా పరస్పరం ఒకరికొకరు వీడియోలు విడుదల చేసుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న వివాదంలో ఇతరులు జోక్యం చేసుకోవడం లేదు. ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు కూటమి ప్రభుత్వం నుంచి కూడా అనుకున్న స్థాయిలో మాట సాయం దక్కకపోవడం విశేషం.