Pulivendula Election History: పులివెందుల( pulivendula).. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఆ పేరులోనే ఒక రాజకీయ వ్యవస్థ దాగి ఉంది. అంతలా పెనవేసుకుపోయింది ఆ పేరు. ఉమ్మడి ఏపీలోనైనా, అవశేష ఆంధ్రప్రదేశ్ లోనైనా ఆ పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే యెలుగింటి సందింటి రాజశేఖర్ రెడ్డి… అలియాస్ వైయస్ రాజశేఖర్ రెడ్డి. 1978లో ప్రారంభమైన ఆ కుటుంబ ప్రస్థానం నేటికీ కొనసాగుతూ వస్తోంది. ఏ ప్రభుత్వాలు ఏర్పడినా.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆ కుటుంబ హవా మాత్రం కొనసాగుతూ వస్తోంది. సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో ఆ కుటుంబానికి ఎదురుగా ప్రత్యర్థులు నిలుస్తున్నారు కానీ.. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఏ ఒక్కరూ సాహసించిన దాఖలాలు లేవు. అటువంటి చోట నిలబడింది.. కలబడుతోంది తెలుగుదేశం పార్టీ. జడ్పిటిసి ఉప ఎన్నికల్లో గట్టిగానే పోరాటం చేస్తోంది. వైఎస్ కుటుంబ చరిష్మను తగ్గించాలన్న ప్రయత్నంలో తెలుగుదేశం కూటమి నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు.
Also Read: రాఖీ కూడా కట్టనంత ద్వేషంతో షర్మిల.. జగన్ కేంటి పరిస్థితి?
ఎప్పుడూ ఏకగ్రీవమే..
వైయస్ కుటుంబానికి గుండెకాయ లాంటిది కడప జిల్లా( Kadapa district). అందునా పులివెందుల అంటే.. స్థానిక సంస్థలు ఎన్నికలు అంటేనే ఏకగ్రీవం. అక్కడ ప్రత్యర్ధులు నిలవలేరు. ఒకవేళ నామినేషన్ దాఖలు చేసిన చివరి నిమిషంలో డ్రాప్ అవుతారు. అంతలా ఉంటుంది అక్కడ ప్రభావం. 1995లో జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో పులివెందుల స్థానం ఏకగ్రీవం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా వైయస్ కుటుంబం ఏకగ్రీవం చేసుకుంది. 2001లో ఏకగ్రీవం అయింది.. 2006లో సైతం ఏకగ్రీవం అయింది పులివెందుల జడ్పిటిసి స్థానం. కేవలం పులివెందులే కాదు.. కడప జిల్లాలో అన్ని స్థానాలు ఏకగ్రీవం చేసుకునే సత్తా వైయస్సార్ కుటుంబానికి ఉండేది. అంతెందుకు 2021లో సైతం పులివెందుల జడ్పిటిసి స్థానం ఏకగ్రీవం అయింది. అయితే 2024 కి వచ్చేసరికి సీన్ మారింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తొడగొడుతోంది.
టిడిపి గట్టిగానే పోరాటం..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మానసికంగా గెలిచినట్టే. ఎందుకంటే గతంలో జడ్పిటిసి గా నిలబడాలంటే ప్రత్యర్థులు భయపడేవారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ ఉండేది కాదు. ఒకవేళ ధైర్యం పోగుచేసుకొని పోటీ చేసినా చివరి నిమిషంలో నామినేషన్లు ఉపసంహరించుకునేవారు. కానీ ఈసారి మాత్రం అలా లేదు. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం గతం మాదిరిగా తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. అందుకే ఎక్కడో విదేశాల్లో ఉన్న చనిపోయిన జడ్పిటిసి కుమారుడిని తెచ్చి పోటీ చేయించారు. గతంలో నామినేషన్లు వేసి ఊరుకునేవారు. గ్రామాలకు వెళ్లి ప్రచారం కూడా చేసేవారు కాదు. అటువంటిది ప్రచారపర్వంలోకి దిగారు. సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. అందుకే అంత ఈజీగా తెలుగుదేశం పార్టీ విడిచి పెట్టే అవకాశం లేదు. ఒకవేళ వందల ఓట్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా.. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పదనే హెచ్చరికలు ఇచ్చే అవకాశం ఉంది.
Also Read: చివరకు పెళ్లిని వదల్లే.. జగన్ జన సమీకరణ పిచ్చి
ఉత్సాహంగా ఓటర్లు
ఒకప్పుడు పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ నుండి బలమైన అభ్యర్థి బరిలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా నేరుగా వైయస్సార్ కుటుంబానికి సవాల్ విసురుతున్నారు. వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి చూసిన పులివెందుల ప్రజల్లో ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేద్దామంటే అవకాశం చిక్కని పరిస్థితి వారిది. అటువంటిది ఇప్పుడు ఆ అవకాశం చిక్కడంతో ఓటర్లు కూడా ఆసక్తితో ఉన్నారు. దీంతో పులివెందుల ఫలితం ఎలా ఉంటుందో నన్న చర్చ బలంగా నడుస్తోంది. నేటితో ప్రచారానికి తెర పడనుంది. ఈనెల 12న పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు రానున్నాయి.