Pulivendula Election Counting Update: పులివెందులలో( pulivendula) రెండో స్థానం ఎవరిది? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందా? లేకుంటే ఆ స్థానం కాంగ్రెస్ చేజిక్కించుకుంటుందా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. ప్రస్తుతం కడపలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం అయింది. ప్రస్తుతం కట్టలు కడుతున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితం ప్రకటించనున్నారు. అయితే ప్రధానంగా పులివెందుల ఫలితం పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక్కడ విజేత కంటే.. రెండో స్థానం ఎవరికి వస్తుంది? అనే దానిపై బలమైన చర్చ జరుగుతోంది. ఇక్కడ రీకౌంటింగ్ రెండు కేంద్రాల్లో జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఈరోజు కౌంటింగ్ కు సైతం ఆ పార్టీ వెళ్లలేదు. దీంతో విజేత ఎవరు అనేది తేలిపోయినట్టు అయింది. అయితే రెండో స్థానం ఎవరిది అనేది ఇప్పుడు బలమైన చర్చ.
Also Read: పులివెందులలో ఓడితే.. ఇరు పార్టీలకు ప్రాణ సంకటమే!
కుటుంబ అభిమానులు అధికం
పులివెందుల అంటే వైయస్సార్ కుటుంబ అభిమానులు ఎక్కువ. ఆపై కాంగ్రెస్ పార్టీకి ( Congress Party)సానుభూతి కూడా ఎక్కువే. అటువంటి చోట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగంలో ఉన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా ఓట్లు పెరిగాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోలా ఆరోపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిందని చూపించేందుకు.. అధికార టిడిపి రిగ్గింగ్ కు పాల్పడిందని.. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సైతం భారీగా ఓట్లు వేశారని.. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయిందని చూపేందుకు ఈ ప్రయత్నం అంటూ చెబుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల ఎంపీగా పోటీ చేశారు. ఆమెకు దాదాపు లక్షన్నర ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా పులివెందులలోనే భారీగా ఓట్లు వచ్చి ఉంటాయని ఒక అంచనా. అయితే ఇప్పుడు పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. కాంగ్రెస్ పార్టీకి వైసీపీ కంటే ఎక్కువ ఓట్లు వస్తే.. రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది.
రీపోలింగ్,కౌంటింగ్ బహిష్కరణ..
అయితే ఉప ఎన్నికలు అనేవి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అధికార పార్టీ కనుసనల్లోనే జరుగుతాయి. అంతమాత్రాన ప్రజా తీర్పును తక్కువగా అంచనా వేయలేం. అలా అయితే 2012లో కాంగ్రెస్ పటిష్ట స్థితిలో ఉంది. రాష్ట్రంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ సమయంలోనే ఉప ఎన్నికల్లో అద్భుత విజయం సొంతం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో అధికార కాంగ్రెస్ తో పాటు టిడిపి కూడా ఎన్నికల బరిలో నిలిచింది. ఆ రెండు పార్టీలను మట్టికరిపించిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది. మరి అదే పరిస్థితి పులివెందుల ఉప ఎన్నికల్లో కూడా ఉండాలి కదా. అయితే రీపోలింగ్ తో పాటు కౌంటింగ్ ను బహిష్కరించడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. ఒకవేళ ఆ పార్టీ భావిస్తున్నట్లు కాంగ్రెస్కు రెండో స్థానం వస్తే మాత్రం వైసీపీకి నష్టమే.
Also Read: పులివెందులలో టిడిపి గెలిచినట్టే!
ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన..
అయితే రిగ్గింగ్ లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయని చెబుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ స్వతహాగా పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఉన్నారు. వైయస్సార్ కుటుంబానికి అభిమానులు కొనసాగుతున్నారు. షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉండడంతో తప్పకుండా.. ఆ సానుభూతితో ఓట్లు వేసిన వారు ఉన్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రిగ్గింగ్ లో భాగంగా.. వైసీపీని మూడో స్థానంలో నెట్టేందుకు.. కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు వేసారని చెబుతోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.