Amaravati Capital: రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే నెల నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని భావిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం పై దృష్టి పెట్టింది. అటు కేంద్రం సైతం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఇప్పించింది. పలుమార్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిని సందర్శించారు. నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకోవైపు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. వర్షాలతో పనులకు ఆటంకం కలిగింది. వీలైనంత త్వరగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసి.. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో ఆలోచన చేసింది. భవిష్యత్తులో వరదల నుంచి అమరావతిని సేఫ్ గా ఉంచడానికి, ముంపు లేకుండా చూడడానికి కీలక ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
* కరకట్ట విస్తరణ
మొన్న వరదలకు అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం జరిగింది. కానీ గతంలోనే టిడిపి సర్కార్ అమరావతికి ముంపు ప్రమాదం లేకుండా అనేక చర్యలు చేపట్టింది. ఇప్పుడు తాజాగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పూర్తి ముంపు లేకుండా చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న కరకట్టను విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం 650 కోట్ల రూపాయలతో అంచనాలు వేసినట్లు సమాచారం. ప్రకాశం బ్యారేజీ నుంచి వైకుంఠపురం వరకు కరకట్టను బలోపేతం చేయడంతో పాటు.. కొన్ని ప్రాంతాల్లో కట్టను లోపలకు మళ్ళించాలని ప్రతిపాదనలు చేశారు అధికారులు. ప్రభుత్వం ఆమోదించి వెంటనే టెండర్లకు పిలవనున్నట్లు తెలుస్తోంది.
* భవిష్యత్తులో ప్రమాదం కలుగకుండా
ప్రస్తుతం కృష్ణానదికి 13.43 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. వాతావరణ మార్పుల్లో భాగంగా 15 లక్షల క్యూసెక్కులు వచ్చినా.. అమరావతి నగరానికి ఇబ్బంది లేకుండా దీనిని రూపొందించనున్నారు. దీంతోపాటు కృష్ణానది తీరాన పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. అయితే గతంలోనే ఈ ప్రయత్నం జరిగింది. కానీ రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే తాజాగా ప్రతిపాదనలు రావడంతో మంత్రి నారాయణ బాధిత రైతులను కలిశారు. పూలింగుకు ఇస్తే ఇంటికొచ్చి భూములు తీసుకుంటామని ప్రకటించారు. బ్యారేజీ నుంచి వారధి మీదుగా వెళ్లేందుకు రెండు లైన్ల రోడ్లకు సైతం ప్లాన్ చేస్తున్నారు.
* పర్యాటకంగా అభివృద్ధి
కృష్ణానది కరకట్టల బలోపేతం తో పాటు పర్యాటకంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. దానికి కొనసాగింపుగా వెంకటపాలెం నుండి సీతానగరం వరకు కొత్తగా పనులు చేపట్టనున్నారు. దీనిలో భాగంగానే వెంకట పాలెం నుంచి హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం వరకు కరకట్టను బలోపేతం చేయనున్నారు. సెక్రటేరియట్, హైకోర్టుకు వెళ్లాలంటే కరకట్ట మార్గమే దగ్గరగా ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి వెంకటపాలెం లోని ప్రకృతి ఆశ్రమం వరకు కరకట్టను నాలుగు లైన్లుగా విస్తరిస్తే ట్రాఫిక్ సమస్యలు సైతం పరిష్కరించవచ్చు. అందుకే కరకట్ట నిర్మాణాన్ని ప్రాధాన్యతాంశంగా తీసుకుంది సిఆర్డిఏ.
* పెరుగుతున్న అంచనా వ్యయం
అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి అంచనా వ్యయం పెరుగుతోంది. అసలు నిర్మాణాలు ప్రారంభం కాకుండానే ఇలా వరద ముంపు కోసం సైతం ఖర్చు చేయాల్సి రావడం విశేషం. మొన్నటికి మొన్న దాదాపు 37 కోట్ల రూపాయలతో జంగిల్ క్లియరెన్స్ పనులకు టెండర్లు ఖరారు చేశారు. ఇప్పుడు అమరావతిని ముంపు భారీ నుంచి కాపాడడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా అయితే లక్షల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమవుతాయి. ఇప్పటికే నిధుల సేకరణలో ఇబ్బంది పడుతోంది ప్రభుత్వం. దీనికి అదనపు ఖర్చులు తోడు కావడంతో కష్టతరంగా మారింది.