Prithviraj: కొందరు లేనిపోని వివాదాల్లో చిక్కుకుంటారు. అనవసరంగా నోరు పారేసుకుని కష్టాలను తెచ్చుకుంటారు. టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్( Prithviraj) సైతం అదే మాదిరిగా వ్యవహరించారు. ఒత్తిడికి గురై ఆస్పత్రిలో చేరారు. పృథ్వీరాజ్ ఈరోజు అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు. రాజకీయాలతో పాటు సినిమాల్లో కనిపించే ఆయన తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై సెటైర్లు వేశారు. దీంతో ఆ పార్టీ శ్రేణులకు టార్గెట్ అయ్యారు. సోషల్ మీడియాలో పృథ్వీరాజ్ కు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుచిత కామెంట్లు పెట్టినట్లు తెలుస్తోంది. రాంగ్ కాల్స్ రావడంతో పృధ్విరాజ్ సైతం ఆందోళనకు గురయ్యారట. అందుకే ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
* వైసీపీలో యాక్టివ్ రోల్
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి బలమైన మద్దతు దారుడిగా ఉండేవారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలిగారు. వచ్చిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ విభాగంగా పనిచేసే ఎస్విబిసి ఛానల్ కు అధ్యక్షుడిగా నియమించారు. అయితే కొద్ది రోజులకే పృథ్వీరాజ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం మానేయడంతో పృథ్వీరాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. కూటమి తరుపున ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినా పృధ్విరాజ్ కు ఎటువంటి పదవి దక్కలేదు.
* సినిమాల్లో బిజీగా
ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి. ఇటీవల లైలా( Laila) అనే సినిమాలో నటించారు. ఆ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. ఇదివరకు 150 గొర్రెలు ఉండేవని.. ఇప్పుడు 11 కు తగ్గాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పృథ్వి కామెంట్స్ వైరల్ కావడంతో వైసీపీ శ్రేణులు రియాక్ట్ అవుతున్నాయి. వందలాదిమంది సోషల్ మీడియాలో పృథ్విరాజ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.
* గత మూడు రోజులుగా అదే పనిగా
గత మూడు రోజులుగా పృథ్విరాజ్( Prithviraj) కు వైసిపి శ్రేణులనుంచి టార్చర్ ఎదురైనట్లు తెలుస్తోంది. వందలాది ఫోన్ కాల్స్ కుటుంబ సభ్యులకు సైతం రావడంతో ఆయన ఆందోళనకు గురైనట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఆయనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని.. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మొత్తానికి అయితే అనవసరంగా వైసీపీని కెలికి లేనిపోని కష్టాలను తెచ్చుకున్నారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి.