PM Modi AP Tour : ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 6న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రావడం ఇది రెండోసారి.ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం తో పాటు మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ సెజ్ సిటీ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావడంతో రాష్ట్ర అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సమీపంలో పరిశ్రమలతో పాటు ఇతర అవసరాల కోసం ఇదివరకే 20 వేల ఎకరాల భూమిని సేకరించారు. అయితే కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ కోసం 12,500 ఎకరాలను కేటాయించారు. ఎగుమతి ఆధారిత పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్రమలకు ఆధారంగా కొన్ని చిన్న పరిశ్రమలు సైతం ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. ఈ సెజ్ సిటీ కోసం సేకరించిన భూముల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక వసతులను కల్పించనున్నాయి. సాగరమాల పథకంలో భాగంగా తీరంలో రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పనులు కూడా ఊపందుకున్నాయి. ఈ సాగరమాలకు కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉండడంతో ఎగుమతులు, దిగుమతులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఇక్కడ ఇండస్ట్రియల్ సెజ్ ను ఏర్పాటు చేస్తున్నారు.
* ఏపీకి ప్రాధాన్యం
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి కేంద్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. అమరావతి రాజధానికి అనుసంధానంగా ప్రత్యేక రైల్వే లైన్లు, జాతీయ రహదారులను సైతం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సైతం సాయం చేస్తామని ప్రకటించింది. రాజ్యాంగబద్ధంగా ఆర్థిక కేటాయింపులు ఉంటాయని చెప్పుకొచ్చింది. పరిశ్రమల ఏర్పాటులో సైతం ఏపీకి అత్యంత ప్రాధాన్యమిస్తోంది.
* పాలనలో భాగస్వామ్యం
ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ మద్దతు అనివార్యంగా మారింది. రాష్ట్రంలో బిజెపి, కేంద్రంలో టిడిపి మంత్రి పదవులు పంచుకున్నాయి. పాలనలోనూ రెండు పార్టీలు భాగస్వామ్యం అయ్యాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు చంద్రబాబు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అందరికీ తెలిసిన విషయమే. పైగా అభివృద్ధి చేస్తారని ప్రజలు చంద్రబాబుకు చాన్స్ ఇచ్చారు. ఆ నమ్మకం పోగొట్టుకోకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అటు పార్టీ శ్రేణులకు సైతం అలెర్ట్ చేస్తున్నారు. పాలనను గాడిలో పెట్టడంతో పాటు సంక్షేమ పథకాల అమలుపై కూడా దృష్టి పెట్టారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోనున్నారు.
* చంద్రబాబు జాగ్రత్తలు
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల కు చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి 80 రోజులు అవుతుంది. ఇంకా సంక్షేమ పథకాలు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు చంద్రబాబు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అందులో భాగంగానే పారిశ్రామిక సెజ్ కు ప్రధాని మోదీ తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More