AP Liquor Prices : ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. కొత్త సంవత్సరం వేళ మద్యం ధరలు తగ్గిస్తూ కొన్ని కంపెనీలు నిర్ణయించాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యాన్ని.. పాత ధరలకే అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3300కు పైగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. గతంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహించగా.. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. హామీ ఇచ్చిన మాదిరిగానే పాత ప్రీమియం బ్రాండ్లన్నీ అందుబాటులోకి వచ్చాయి. అయితే ధరల విషయంలో మాత్రం కాస్త వ్యత్యాసం కనిపిస్తోంది. బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి వచ్చిన ధర మాత్రం తగ్గించకపోవడం పై విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో క్రమేపి కొన్ని బ్రాండ్ల ధరలు తగ్గిస్తూ సంబంధిత కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే తాజాగా ఓ 11 బ్రాండ్లకు సంబంధించి ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ధరలు తగ్గించాలని ఆ 11 కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ కంపెనీలకు సంబంధించి క్వార్టర్ మద్యంపై 30 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. ఆఫ్ బాటిల్ ధర 60 రూపాయలు.. ఫుల్ బాటిల్ ధర 120 రూపాయల వరకు తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది.
* పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో..
మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. విక్రయాలు కూడా మొదలుపెట్టాయి. కానీ మద్యం ధరలు మాత్రం తగ్గలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఆయా మద్యం కంపెనీలతో జరిగిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో కొన్ని బ్రాండెడ్ మద్యం ధరలు తగ్గాయి. మాన్సన్ హౌస్ బ్రాందీ క్వార్టర్ ధర 220 నుంచి 190 రూపాయలకు తగ్గింది. అదే బ్రాండ్ హాఫ్ బాటిల్ ధర 440 నుంచి 380 కి తగ్గించారు. ఫుల్ బాటిల్ ధర 870 నుంచి 760 కి తగ్గించారు. రాయల్ చాలెంజి సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర 230 నుంచి 210 కి తగ్గించారు. అదే బ్రాండ్ ఫుల్ బాటిల్ ధర920 నుంచి 840కు తగ్గించారు. యాంటీక్విటీ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ ధరను 1600 నుంచి 1400 కు తగ్గించారు. ఇప్పుడు మరో 11 బ్రాండ్లకు సంబంధించి ధరలు తగ్గించేందుకు కంపెనీలు ముందుకు రావడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* అమ్మకాలపై గట్టి నిఘా
ఏపీలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 4,500 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే చాలా షాపుల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం స్ట్రాంగ్ హెచ్చరిక ఇచ్చింది. ఎక్కడైనా అధిక ధరలకు విక్రయించినా.. బెల్ట్ షాపులను ప్రోత్సహించినా కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. తొలిసారిగా జరిమానా విధిస్తామని.. రెండోసారి పట్టుబడితే మాత్రం లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేసింది. అటు మద్యం విక్రయాలను సైతం ఎక్సైజ్ శాఖ గమనిస్తోంది. అదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం బెల్ట్ షాపులపైన అలెర్ట్ అయ్యింది.